ఏపీఎస్పీ సిబ్బందికి ప్రమోషన్లు... మంత్రి నారా లోకేశ్ చొరవతో 300 కుటుంబాల్లో ఆనందం

Nara Lokesh Initiative Leads to APSP Staff Promotions
  • ఏపీఎస్పీలో 300 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఆర్ఎస్ఐలుగా పదోన్నతులు
  • ప్రజాదర్బార్‌లో సిబ్బంది వినతికి మంత్రి లోకేశ్ సానుకూల స్పందన
  • ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం
  • అండగా నిలిచిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీఎస్పీ సిబ్బంది
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న హెడ్ కానిస్టేబుళ్ల నిరీక్షణ ఫలించింది. కూటమి ప్రభుత్వం ఏకకాలంలో 300 మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్లు (ఏఆర్ఎస్ఐ)గా పదోన్నతులు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో ఈ ప్రక్రియ పూర్తి కావడం గమనార్హం.

కొంతకాలంగా పదోన్నతులు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లు ఇటీవల ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారంలో చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకువస్తే అండగా ఉంటానని భరోసా ఇచ్చిన లోకేశ్, వారి వినతిపై సానుకూలంగా స్పందించారు. ఇచ్చిన మాట ప్రకారం, సంబంధిత ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి పదోన్నతుల ఫైల్‌ను వేగంగా ముందుకు కదిలించారు.

వాస్తవానికి 2014-19 మధ్య కాలంలోనే సివిల్, ఏఆర్ విభాగాలతో పాటు ఏపీఎస్పీ సిబ్బందికి కూడా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం భావించింది. అయితే, కొన్ని సాంకేతిక కారణాలు, ఆ తర్వాత ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఏపీఎస్పీ సిబ్బంది ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నా ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సిబ్బంది మంత్రి లోకేశ్ ను ఆశ్రయించారు.

మంత్రి లోకేశ్ చూపిన చొరవతో తమ చిరకాల వాంఛ నెరవేరడంతో సుమారు 300 కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. సమస్యను త్వరితగతిన పరిష్కరించి, తమకు అండగా నిలిచిన మంత్రి లోకేశ్ కు ఏపీఎస్పీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 
Go Back to Shorts
Nara Lokesh
APSP
APSP promotions
Andhra Pradesh Special Police
Head constables
Assistant Reserve Sub-Inspector
AP police promotions
Andhra Pradesh police
TDP government
Andhra Pradesh news

More Telugu News