Revanth Reddy: రేవంత్ రెడ్డి చేతులమీదుగా 'అల్లు సినిమాస్' ప్రారంభం

Revanth Reddy Inaugurates Allu Cinemas in KokaPet
  • ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహానికి నివాళులర్పించిన సీఎం
  • అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో కలిసి మల్టీప్లెక్స్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి
  • ఈ నెల 19 నుంచి సినిమాల ప్రదర్శన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు కుటుంబానికి చెందిన మల్టీప్లెక్స్ 'అల్లు సినిమాస్'ను ప్రారంభించారు. దీనిని కోకాపేటలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత నటుడు అల్లు రామలింగయ్య విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం అల్లు అరవింద్, అల్లు అర్జున్ తదితరులతో కలిసి మల్టీప్లెక్స్‌ను పరిశీలించారు.

అల్లు సినిమాస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ను ప్రదర్శించారు. రేవంత్ రెడ్డికి ఒకవైపు అల్లు అర్జున్, మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూర్చున్నారు. భట్టివిక్రమార్క పక్కన అల్లు అరవింద్ కూర్చుని ఈ విజువల్స్‌ను వీక్షించారు. ఈ విజువల్స్ ప్రదర్శిస్తుండగా అల్లు అరవింద్ ఏదో చెప్పగా ముఖ్యమంత్రి సరదాగా నవ్వేశారు.

ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ కలిగిన మల్టీప్లెక్స్‌గా అల్లు సినిమాస్ రూపొందింది. ఈరోజు లాంఛనంగా ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్‌లో ఉగాది సందర్భంగా ఈ నెల 19 నుంచి సినిమాలు ప్రదర్శించనున్నారని తెలుస్తోంది.

ఇందులో నాలుగు స్క్రీన్‌లు ఉండగా, స్క్రీన్ 1లో డాల్బీ విజన్ ఉంది. రేపటి నుంచి బుక్ మై షో ద్వారా ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్లు అల్లు సినిమాస్ తెలిపింది. తొలుత ధురంధర్-2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సందడి చేయనున్నాయి.

Revanth Reddy
Allu Cinemas
Telangana CM
Allu Arjun
KokaPet
Mallu Bhatti Vikramarka
Allu Aravind

More Telugu News