తన తల్లి పాత ఆడియో క్లిప్‌ను బయటకు తీసి, వివాదం సృష్టిస్తున్న వారిపై రష్మిక ఫైర్

  • వ్యక్తిగత దాడులను ఎనిమిదేళ్లుగా భరించానన్న రష్మిక
  • 24 గంటల్లో ఆడియో క్లిప్ తొలగించాలంటూ వార్నింగ్
  • వాటిని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక

నటి రష్మిక మందన్న తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నటుడు విజయ్ దేవరకొండతో వివాహం జరిగిన కొద్ది రోజులకే, ఎనిమిదేళ్ల క్రితం నాటి తన తల్లి ఆడియో క్లిప్‌ను కావాలనే బయటకు తీసి వివాదం సృష్టించడంపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎనిమిదేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను మౌనంగా భరించానని, అయితే ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగడం అన్ని హద్దులను దాటడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఒకరి అనుమతి లేకుండా ప్రైవేట్ సంభాషణలను రికార్డ్ చేయడం, అందులోని కొంత భాగాన్ని మాత్రమే వాడుకుని తప్పుడు అర్థాలు వచ్చేలా ప్రచారం చేయడం తన ప్రైవసీకి భంగం కలిగించడమేనని రష్మిక స్పష్టం చేశారు. వ్యూస్ కోసం ఒకరి గౌరవాన్ని తాకట్టు పెట్టే ధోరణిని ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. తప్పుడు వార్తలు, ఆ ఆడియో క్లిప్‌ను ప్రచారం చేస్తున్న వారికి ఆమె 24 గంటల సమయాన్ని నిర్దేశించారు. ఈ గడువులోగా వాటిని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని సంబంధిత వ్యక్తులకు, మీడియా సంస్థలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.


రష్మిక తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. సినీ తారల వ్యక్తిగత జీవితాలను సాకుగా చూపి వేధింపులకు గురిచేసే ధోరణికి అడ్డుకట్ట వేయాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన శుభ సమయంలో ఇలాంటి వివాదాలు సృష్టించడం అమానుషమని పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.


2016లో కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ' సినిమా సమయంలో రష్మిక, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. 2017లో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే 2018లో వారు విడిపోయారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆడియోలో.. ఆ సమయంలో రష్మిక ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆమె తల్లి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నాటి ఈ సంభాషణను, ఇప్పుడు తన పెళ్లి జరిగిన శుభసమయంలో కావాలనే బయటపెట్టడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News