Pinnelli Ramakrishna Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరుడి అరెస్ట్

Pinnelli Ramakrishna Reddy Associate Karnati Veerabhadra Rao Arrested
  • కర్నాటి వీరభద్రరావును అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు
  • హైకోర్టు అడ్వకేట్‌ను నిర్బంధించి బలవంతంగా ఆస్తులు రాయించుకున్నట్టు ఆరోపణలు
  • పరారీలో ఉన్న మరో నిందితుడు కర్నాటి సతీశ్

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు కర్నాటి వీరభద్రరావును విజయవాడ పటమట పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ను కిడ్నాప్ చేసి, నిర్బంధించి హింసించినట్లు నమోదైన కేసులో వీరభద్రరావును ఏ-1గా పోలీసులు చేర్చారు.


కేసు వివరాల్లోకి వెళితే... 2023 నవంబర్ 7వ తేదీన హైకోర్టు అడ్వకేట్‌ను అక్రమంగా నిర్బంధించి, తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనపై దొంగ కేసులు పెట్టి, కిడ్నాప్ చేసి, ప్రాణభయం చూపించి బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారని సదరు అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కిడ్నాప్ ఉదంతంలో అప్పటి డీఎస్పీ పల్లంరాజు, ఎస్ఐ రబ్బానీ నిందితులకు సహకరించినట్లు విచారణలో తేలింది. వీరు ఇప్పటికే శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెన్షన్‌లో ఉన్నారు.


ఈ కేసులో కర్నాటి వీరభద్రరావుతో పాటు కర్నాటి సతీశ్‌లపై కూడా తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. వీరిద్దరూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరు పొందారు. వీరభద్రరావు అరెస్టుతో ఈ కేసులో కీలక పురోగతి లభించినట్లయింది. మరో నిందితుడు కర్నాటి సతీశ్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసులో విజయవాడ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Pinnelli Ramakrishna Reddy
Karnati Veerabhadra Rao
Andhra Pradesh High Court Advocate
Kidnapping Case
Vijayawada Police
Pinnelli Followers
AP High Court
Illegal Detention
Karnati Satish
Law and Order

More Telugu News