క్రికెట్‌ను టీమిండియా మరో స్థాయికి తీసుకెళ్లింది: విండీస్ లెజెండ్ వివ్‌ రిచర్డ్స్‌ ప్రశంసలు

  • వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పిందన్న రిచర్డ్స్
  • విండీస్ సంస్కృతిలో క్రికెట్‌కు అత్యంత ప్రాధాన్యత ఉందని వ్యాఖ్య
  • ఆంటిగ్వా, బార్బుడాలో జరగనున్న కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశం

వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం, 'మాస్టర్ బ్లాస్టర్' వివ్‌ రిచర్డ్స్‌ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం వైట్‌బాల్‌ క్రికెట్‌లో భారత్ ప్రదర్శిస్తున్న తీరు అద్భుతమని, ఈ క్రీడను ఇండియా మరో స్థాయికి తీసుకువెళ్లిందని ఆయన కొనియాడారు. 2026 టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన నేపథ్యంలో ఆయన ఒక అంతర్జాతీయ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పిందని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు లభించిన గొప్ప బహుమతి అని రిచర్డ్స్ పేర్కొన్నారు. తమ హయాంలో వెస్టిండీస్ జట్టు 1975, 1979 ప్రపంచకప్‌లు గెలిచిన రోజులను గుర్తుచేసుకున్న ఆయన, విండీస్ సంస్కృతిలో క్రికెట్‌కు అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపారు. వెస్టిండీస్ లో క్రికెట్ కు ఉన్నత స్థానం ఉందని అన్నారు. 


రిచర్డ్స్ స్వస్థలమైన ఆంటిగ్వా, బార్బుడాలో కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి రిచర్డ్స్ అధికారిక రాయబారిగా ఉన్నారు. ఈ క్రమంలో, లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో రిచర్డ్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కింగ్ చార్లెస్ III, క్వీన్ కెమిల్లాకు 'మాస్టర్ బ్లాస్టర్' అని రాసి ఉన్న ప్రత్యేక బ్యాట్‌ను ఆయన బహూకరించారు.



More Telugu News