IPL 2026: ఐపీఎల్‌కు తలనొప్పిగా మారిన పశ్చిమాసియా సంక్షోభం.. ఫ్రాంచైజీలలో ఆందోళన

Iran War To Impact IPL 2026 Players Now
  • ఐపీఎల్‌ 2026పై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం
  • విదేశీ ఆటగాళ్ల ప్రయాణాలపై నెలకొన్న తీవ్ర ఆందోళన
  • టీ20 ప్రపంచకప్ తర్వాత ఇళ్లకు చేరని పలువురు క్రికెటర్లు
  • రాష్ట్రాల ఎన్నికలతో పాటు యుద్ధాన్ని పరిగణనలోకి తీసుకుంటున్న బీసీసీఐ
  • హోటళ్లలో వంటగ్యాస్ కొరత కూడా మరో సవాల్‌గా మారిన వైనం
పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌పైనా తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొన్న ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా వంటి జట్ల ప్రయాణ ప్రణాళికలు దుబాయ్, దోహా వంటి కీలక విమానాశ్రయాల గగనతలాలు మూసివేయడంతో తారుమారయ్యాయి. ఇప్పుడు ఈ ప్రభావం ఐపీఎల్‌పైనా పడింది. విదేశీ ఆటగాళ్లు, ముఖ్యంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సకాలంలో తమ జట్లతో కలుస్తారా? అనే దానిపై ఆందోళన నెలకొంది.

పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు కష్టతరంగా మారాయి. టీ20 ప్రపంచకప్ ముగిసి వారం రోజులు దాటినా కొందరు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఆటగాళ్లు ఇంకా తమ స్వదేశాలకు చేరుకోలేకపోయారు. "వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఆటగాళ్ల ప్రయాణంలో గణనీయమైన జాప్యం జరిగింది. వారిని తిరిగి భారత్‌కు సకాలంలో తీసుకురావడం కష్టమైన పని. అంతేకాకుండా యుద్ధం కారణంగా విమాన టికెట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి" అని ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపారు.

బీసీసీఐ ఇప్పటికే తొలి 20 ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను నిన్న‌ ప్రకటించింది. తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. అయితే, ఇప్పుడు ఎన్నికలతో పాటు పశ్చిమాసియాలో ముదురుతున్న సంక్షోభాన్ని కూడా బీసీసీఐ అధికారులు పూర్తి షెడ్యూల్ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటున్నారు.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ మాత్రం ఆశాభావం వ్యక్తం చేశారు. తమ జట్టులోని వెస్టిండీస్ ఆటగాడు అకీల్ హోస్సేన్, దక్షిణాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ ఐపీఎల్ ఆరంభానికి ముందే జట్టుతో కలుస్తారని, వారి రాకలో ఎలాంటి జాప్యం ఉండదని తాము భావిస్తున్నట్లు ఆయన పీటీఐకి తెలిపారు.

కేవలం ఆటగాళ్ల ప్రయాణాలకే కాకుండా యుద్ధ ప్రభావం దేశంలోని హోటళ్లపైనా పడుతోంది. హోటళ్లలో వంటగ్యాస్ కొరత ఏర్పడటంతో నిరంతరాయ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమలు చేసింది. ఈ ప్రతికూల పరిస్థితుల నడుమ ఐపీఎల్ 2026 టోర్నీని సజావుగా నిర్వహించడం బీసీసీఐకి సవాల్‌గా మారనుంది.
IPL 2026
West Asia crisis
BCCI
T20 World Cup
Franchise
Akila Hossein
Dewald Brevis
Travel delays
Cricket
War impact

More Telugu News