బ్రెయిన్ డెడ్... అంబులెన్స్‌లో వెళ్తుండగా భారీ కుదుపుతో తిరిగి బ్రతికిన మహిళ

  • ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్‌లో ఘటన
  • మహిళ ప్రాణాలపై ఆశలు కోల్పోయిన కుటుంబం
  • అనూహ్య పరిణామంతో మరలా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన కుటుంబం
ఉత్తరప్రదేశ్‌లో వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన మహిళను కుటుంబ సభ్యులు అంబులెన్సులో ఇంటికి తీసుకువెళుతుండగా భారీ కుదుపుతో అపస్మారకస్థితి నుంచి బయటపడి ఊపిరితీసుకోవడం ప్రారంభించింది. కుటుంబ సభ్యులు ఆ మహిళ ప్రాణాలపై ఆశలు కోల్పోయారు. కానీ ఆమె బ్రతికింది. అంత్యక్రియలకు సిద్ధమైన ఆ కుటుంబం ఈ అనూహ్య పరిమాణంతో, ఆమెను తిరిగి ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు.

ఫిలిభిత్ జిల్లాకు చెందిన వినితా శుక్లా స్థానిక జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఫిబ్రవరి 22న ఇంటి పనులు చేస్తుండగానే ఒక్కసారిగా కిందపడిపోయారు. దీనితో కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బరేలీలోని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

ఆమెను మూడు రోజుల పాటు వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఆమె అపస్మారక స్థితిలో ఉందని, బతికే అవకాశాలు తక్కువ అని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇంటికి తీసుకువెళ్లిపోవాలని కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పారు. దీనితో ఫిబ్రవరి 24న అంబులెన్సులో ఇంటికి తీసుకువెళుతుండగా బరేలీ-హరిద్వార్ జాతీయ రహదారిపై గుంత వద్ద వాహనం భారీ కుదుపుకు గురైంది. వెంటనే స్పృహలోకి వచ్చిన ఆమె శ్వాస తీసుకోవడం ప్రారంభించింది. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత 12 రోజుల పాటు ఐసీయూలో ఉన్న ఆమె పూర్తిగా కోలుకున్నారు.

Vinita Shukla
Brain Dead
Uttar Pradesh
Miraculous Recovery
Road Accident
ICU
Bareilly

More Telugu News