వైట్‌హౌస్ వద్ద కలకలం.. బ్యారికేడ్లను ఢీకొట్టిన వ్యాన్

  • వైట్‌హౌస్ వద్ద భద్రతా బ్యారికేడ్లను ఢీకొట్టిన వ్యాన్
  • ఘటనతో వాషింగ్టన్ డౌన్‌టౌన్‌లో పూర్తి లాక్‌డౌన్
  • డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సీక్రెట్ సర్వీస్
  • ఇప్పటికే హై సెక్యూరిటీ మధ్య ఈ ఘటన జరగడంతో కలకలం
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద తీవ్ర కలకలం రేగింది. ఇవాళ‌ ఉదయం ఓ వ్యాన్ వేగంగా దూసుకొచ్చి భద్రతా బ్యారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వాషింగ్టన్ డౌన్‌టౌన్‌లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వైట్‌హౌస్‌కు ఉత్తరంగా ఉన్న లాఫాయెట్ స్క్వేర్ వద్ద ఈ ఘటన జరిగింది. పర్యాటకులు, ఉద్యోగులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోని భద్రతా గేటును వ్యాన్ ఢీకొట్టింది. వెంటనే రంగంలోకి దిగిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. డ్రైవర్ వివరాలను ఇంకా వెల్లడించలేదు.

ప్రస్తుతం ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో వాషింగ్టన్‌లో ఇప్పటికే హై సెక్యూరిటీ కొనసాగుతోంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై సీక్రెట్ సర్వీస్ అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.




More Telugu News