ఇరాన్, అమెరికా యుద్ధాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయానికి ఉపయోగించుకుంటోంది: నరేంద్రమోదీ ఆగ్రహం

  • ప్రవాస భారతీయుల పరిస్థితి దిగజారేలా కాంగ్రెస్ బాధ్యతారాహిత్య ప్రకటనలు చేస్తోందని ఆగ్రహం
  • గల్ఫ్‌లోని పరిస్థితుల కారణంగా మన ఆందోళన సహజమేనన్న ప్రధానమంత్రి
  • లక్షలాది మంది భారతీయులు అక్కడ పని చేస్తున్నారన్న మోదీ
  • గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులను ఒంటరిగా వదలం అన్న నరేంద్ర మోదీ
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని కాంగ్రెస్ పార్టీ మన దేశంలో రాజకీయానికి ఉపయోగించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన ఎర్నాకులంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పశ్చిమాసియా దేశాల్లోని ప్రవాస భారతీయుల పరిస్థితి మరింత దిగజారేలా రెచ్చగొట్టే, బాధ్యతారాహిత్య ప్రకటనలు చేస్తోందని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

గల్ఫ్‌లోని పరిస్థితుల కారణంగా మనం ఆందోళన చెందడం సహజమేనని, అక్కడ లక్షలాది మంది భారతీయులు పని చేస్తున్నారని గుర్తు చేశారు. కానీ ఇక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. మన పౌరులు విదేశాల్లో చిక్కుకున్నప్పుడల్లా వారి క్షేమం కోసం వనరులన్నీ ఉపయోగిస్తుంటామని అన్నారు. మన పౌరులను ఎప్పుడూ ఒంటరిగా వదిలేసేది లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని మన వారికి అవసరమైన సహాయం అందేలా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. అక్కడి మన దేశ రాయబార కార్యాలయాలు మన పౌరులకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. మన మిత్ర దేశాలు భారతీయులను జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి సంక్షోభ సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఈ ప్రచారం కోసం వారు అవసరమైతే రీల్స్ కూడా చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించేందుకు, మేకిన్ ఇండియాను బలోపేతం చేయడానికి పెట్రోలియం రంగాన్ని విస్తరించడం ఎంతో కీలకమని అన్నారు. ఈ యుద్ధం స్వావలంబన అవశ్యకతను మరోసారి నొక్కి చెప్పిందని అన్నారు.


More Telugu News