రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టారు: జగన్

  • బడ్జెట్‌లో అన్నీ మోసపూరిత అంకెలే ఉన్నాయన్న జగన్
  • తాము ఐదేళ్లలో చేసిన అప్పుల కంటే రెండేళ్లలో చంద్రబాబు ఎక్కువ చేశారని ఆరోపణ
  • ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ కూడా ఉండటం లేదని విమర్శ

ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ గణాంకాల నుంచి అవినీతి వరకు పలు అంశాలపై గణంకాలతో సహా విమర్శలు గుప్పించారు. పరిపాలనాదక్షుడిగా బిల్డప్ ఇస్తున్న చంద్రబాబు, వాస్తవానికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. 


కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్నీ మోసపూరిత అంకెలే ఉన్నాయని జగన్ ఆరోపించారు. కాగ్ నివేదికను ఉదహరిస్తూ.. ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేదని విమర్శించారు. "మేము ఐదేళ్లలో చేసిన అప్పుల కంటే చంద్రబాబు రెండేళ్లలోనే ఎక్కువ అప్పులు చేశారు" అని జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో కోవిడ్ కష్టాల్లో కూడా ఎన్బీసీ (నెట్ బారోయింగ్ సీలింగ్ ) పరిమితిని దాటలేదని, కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే నెట్ బారోయింగ్ సీలింగ్ దాటి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ. 3.31 లక్షల కోట్ల అప్పులు దాటేసిందని, జీఎస్‌డీపీ (GSDP) లో అప్పుల శాతం 5.089కి పెరిగిందని గణాంకాలు వివరించారు.


రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోవడానికి 'దోచుకో.. పంచుకో.. తినుకో..' అనే విధానమే కారణమని జగన్ విమర్శించారు. లిక్కర్ మాఫియా నుంచి భూములు కట్టబెట్టడం వరకు అన్నింటా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. విశాఖలో రూ. 5 వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు తన బంధువులకు కట్టబెట్టారని, రియల్ ఎస్టేట్ సంస్థలకు తక్కువ ధరకు భూములు ఇస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ కూడా ఉండటం లేదని, ఏడాదిలో కేవలం 8 రోజులు మాత్రమే కనీస నిల్వలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.


16 రోజుల అసెంబ్లీ సమావేశాల వల్ల ప్రజలకు జరిగిన మేలు సున్నా అని జగన్ అన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోగా, గతంలో తాము ఇచ్చిన పథకాలను కూడా రద్దు చేశారని మండిపడ్డారు.


Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh
AP Debts
GSDP
YS Jagan
Corruption Allegations
AP Budget
Liquor Mafia
Visakha Land Scam

More Telugu News