దానం, కడియంలకు క్లీన్ చిట్ ఇవ్వడంపై కేటీఆర్ ఫైర్
- ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అన్న కేటీఆర్
- కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్ చిట్ ఇచ్చారని మండిపాటు
- ప్రజాస్వామ్య విలువలు ఎక్కడున్నాయని ప్రశ్న
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన క్లీన్ చిట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రాజేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిని ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా కేటీఆర్ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అపహాస్యం చేయడమేనని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుంటున్నారని, ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం ఒక తీర్పు కాదని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే చర్య అని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.