Ali Khamenei: మోజ్తబా నియామకం ట్రంప్ కే కాదు ఖమేనీకి కూడా ఇష్టం లేదట..!

Ali Khamenei Opposed Son Mojtabas Succession
  • వారసత్వం వద్దన్న అయతుల్లా అలీ ఖమేనీ
  • అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ మృతి
  • ఐఆర్ జీసీ ఒత్తిడితోనే నియామకం జరిగిందంటూ ప్రచారం
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి తన కుమారుడు మోజ్తబా ఖమేనీ తన వారసుడిగా రావడం ఏమాత్రం ఇష్టంలేదని, అయినప్పటికీ సైన్యం ఒత్తిడితోనే ఈ నియామకం జరిగిందని సంచలన నివేదికలు బయటకు వచ్చాయి. తన వీలునామాలో ఖమేనీ స్పష్టంగా ‘‘వారసత్వ రాజకీయాలను’’ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించిన తర్వాత, ఇరాన్ నాయకత్వ మార్పుపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఖమేనీ రాసిన వీలునామాలో తన కుమారుడి పేరును ప్రతిపాదించవద్దని ఆయన స్పష్టంగా కోరినట్లు ‘న్యూయార్క్ పోస్ట్’ వెల్లడించింది.
 
మోజ్తబాకు దేశాన్ని నడిపించేంత రాజకీయ అనుభవం కానీ, స్థాయి కానీ లేవని ఖమేనీ నమ్మడమే దీనికి ప్రధాన కారణమని సమాచారం. ‘‘మోజ్తబాను వారసుడిగా చేయవద్దని ఖమేనీ తన వీలునామాలో తేల్చి చెప్పారు. రాజకీయంగా ఆయన ఇంకా ఎదగలేదని తండ్రి అభిప్రాయపడ్డారు’’ అని నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ పరిశోధనా డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ పేర్కొన్నారు.

ఐఆర్ జీసీ ఆధిపత్యం - మత పెద్దల అసమ్మతి..
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్‌ను ఎన్నుకోవాల్సిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ ఈ నిర్ణయంలో వెనకబడిపోయింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) జోక్యం చేసుకుని, మోజ్తబాను బలవంతంగా పదవిలోకి తెచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసెంబ్లీలో మోజ్తబాకు తగినంత మెజారిటీ రాలేదని, కానీ సైన్యం బెదిరింపులకు భయపడి పలువురు మత పెద్దలు సభకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. మోజ్తబాను ఒక ‘‘కీలుబొమ్మ’’గా వాడుకుని, తెర వెనుక నుండి పాలన సాగించవచ్చనేది ఐఆర్ జీసీ వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మోజ్తబా నియామకంపై ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరాన్‌లో శాంతిని కోరుకునే నాయకుడు ఉండాలని, మోజ్తబా నియామకం ఆమోదయోగ్యం కాదని ఆయన హెచ్చరించారు. మోజ్తబా ప్రశాంతంగా జీవించలేరని, అమెరికా ఆమోదం లేని నాయకుడిని ఎన్నుకుంటే తాము టార్గెట్ చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
Ali Khamenei
Mojtaba Khamenei
Iran Supreme Leader
Iranian Leadership
IRGC
Donald Trump
Iran Politics
Succession
Islamic Revolutionary Guard Corps
Assembly of Experts

More Telugu News