Shehbaz Sharif: ఆర్ధిక సంక్షోభంలో పాకిస్థాన్: మంత్రులకు కూడా జీతాలు కట్.. ప్రధాని షరీఫ్ సంచలన నిర్ణయాలు

Shehbaz Sharif Announces Austerity Measures Amid Pakistan Economic Crisis
  • పశ్చిమాసియా యుద్ధంతో పాక్ అతలాకుతలం
  • అత్యంత కఠినమైన పొదుపు చర్యలను ప్రకటించిన షెహబాజ్ షరీఫ్
  • వారానికి నాలుగు రోజులే పని చేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరల పెరుగుదల పాకిస్థాన్‌ను ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో చమురు దిగుమతులు ప్రియమవ్వడంతో, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యంత కఠినమైన పొదుపు చర్యలు ప్రకటించారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు సరఫరాపైనే తమ దేశం ఆధారపడి ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు.


ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై వారానికి నాలుగు రోజులు (సోమవారం నుంచి గురువారం వరకు) మాత్రమే పనిచేస్తాయి. అయితే బ్యాంకులు, ఆసుపత్రులు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఈ నిబంధన వర్తించదు. వచ్చే రెండు వారాల పాటు స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఉన్నత విద్యా సంస్థలు తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, అధికారిక వాహనాలకు ఇచ్చే పెట్రోల్ కోటాను 50 శాతానికి తగ్గించారు. 

అలాగే రాబోయే రెండు వారాల పాటు 60 శాతం ప్రభుత్వ వాహనాలను రోడ్డెక్కించబోమని ప్రధాని తెలిపారు. అంబులెన్స్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. 

మంత్రులు, సలహాదారులు రాబోయే రెండు నెలల పాటు ఎటువంటి జీతాలు తీసుకోరు. పార్లమెంటు సభ్యులందరికీ 25 శాతం, రూ. 3 లక్షల కంటే ఎక్కువ సంపాదించే ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం జీతాల్లో కోత విధించారు. ప్రధాని, ముఖ్యమంత్రులు, గవర్నర్లు సహా అందరు ప్రజాప్రతినిధులు, అధికారుల విదేశీ పర్యటనలపై పూర్తి నిషేధం విధించారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఉంటుంది.
Shehbaz Sharif
Pakistan economic crisis
Pakistan economy
Iran
America Israel conflict
oil prices
government spending cuts
fuel consumption
govt salaries cut
Pakistan PM

More Telugu News