టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ జరిమానా

  • టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌కు జరిమానా
  • మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత, ఒక డీమెరిట్ పాయింట్
  • కివీస్ బ్యాట్స్‌మన్‌పైకి బంతి విసిరినందుకు ఐసీసీ చర్యలు
  • తప్పును అంగీకరించి, బ్యాట్స్‌మన్‌కు క్షమాపణ చెప్పిన పేసర్
  • ఉద్దేశపూర్వకంగా చేయలేదని వివరణ ఇచ్చిన అర్ష్‌దీప్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. దీంతో పాటు అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ ఐదో బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కివీస్ 102/5తో కష్టాల్లో ఉంది. ఆ సమయంలో బంతిని అందుకున్న అర్ష్‌దీప్, బ్యాట్స్‌మన్ డారిల్ మిచెల్ పైకి అనుచితంగా, ప్రమాదకరంగా విసిరాడు. ఇది ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించడమేనని మ్యాచ్ రిఫరీ నిర్ధారించారు. గత 24 నెలల కాలంలో అర్ష్‌దీప్‌కు ఇది తొలి తప్పిదం.

అయితే, తన తప్పును తెలుసుకున్న అర్ష్‌దీప్, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ విధించిన శిక్షను అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం రాలేదు. మ్యాచ్ అనంతరం మిచెల్ వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి క్షమాపణ చెప్పాడు. "నా త్రో రివర్స్ స్వింగ్ అయి నీకు తగిలింది. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నన్ను క్షమించు" అని అర్ష్‌దీప్ కోరగా, ఇద్దరూ నవ్వుతూ చేతులు కలిపారు. ఈ వీడియోను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పంచుకుంది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్‌తో పాటు థర్డ్, ఫోర్త్ అంపైర్లు ఈ అభియోగాన్ని మోపారు.

కాగా, అర్షదీప్ విసిరిన బంతి మిచెల్ తొడపై బలంగా తగిలింది. దాంతో ఆ ఆజానుబాహుడు... అర్షదీప్ పై నిప్పులు చెరుగుతూ దూసుకువచ్చాడు. అయితే, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని మిచెల్ కు నచ్చచెప్పడం, ఆ తర్వాత అర్షదీప్ అతడిని క్షమాపణ కోరడంతో పరిస్థితి సద్దుమణిగింది. 


More Telugu News