Vijay: విజయ్-త్రిష వివాదంపై బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ కీలక వ్యాఖ్యలు
- విజయ్ - త్రిషల వ్యవహారంపై దేశ వ్యాప్తంగా ప్రచారం
- వారిద్దరూ చాలా హుందాగా వ్యవహరిస్తున్నారన్న విక్రమ్ భట్
- ఒక వ్యక్తికి తన మనసు చెప్పిన చోట ప్రేమను వెతుక్కునే హక్కు ఉంటుందని వ్యాఖ్య
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ముద్దుగుమ్మ త్రిషల వ్యక్తిగత జీవితాలపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇప్పుడు బాలీవుడ్ వరకు చేరింది. ఇటీవల ఒక వివాహ వేడుకలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరి మధ్య ఏదో ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి మరింత బలం వచ్చింది. దీనికి తోడు, తాజాగా దర్శకుడు, నటుడు పార్తీబన్ చేసిన కొన్ని వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నెటిజన్లకు, విమర్శకులకు ఒక కీలక సూచన చేశారు.
"విజయ్-త్రిషల వ్యక్తిగత జీవితాల గురించి బయట చాలా వినిపిస్తోంది. ఆ రూమర్స్ నిజమో, కాదో నాకు అనవసరం. కానీ ఒకవేళ అవి నిజమైతే, వారిద్దరూ చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు, దేన్నీ దాచడం లేదు. సమాజం తరచుగా వ్యక్తులను వారు ఇష్టపడని బంధాల్లో బంధిస్తుంది, అది ఒక జైలు లాంటిది. ఒక వ్యక్తికి తన మనసు చెప్పిన చోట ప్రేమను వెతుక్కునే హక్కు ఉంటుంది. నటీనటుల సినిమాలు మాత్రమే మనకు సొంతం, వారి వ్యక్తిగత జీవితాలు కాదు. వారిని జడ్జ్ చేసే హక్కు మనకు లేదు" అని విక్రమ్ భట్ రాసుకొచ్చారు. సమాజం ఒక సమూహంగా మారినప్పుడు ఇతరుల పట్ల సానుభూతిని కోల్పోయి, తీర్పులు చెప్పే జడ్జిలుగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, విజయ్-త్రిషల విషయంలో స్వేచ్ఛ గురించి మాట్లాడిన విక్రమ్ భట్, ప్రస్తుతం తానే ఒక చట్టపరమైన చిక్కుల్లో ఉండటం గమనార్హం. ఒక ప్రముఖ డాక్టర్ నుంచి దాదాపు రూ.30 కోట్ల మేర పెట్టుబడులు సేకరించి, వాటిని సినిమాల కోసం కాకుండా వ్యక్తిగత అవసరాలకు మళ్లించారనే ఆరోపణలతో రాజస్థాన్ పోలీసులు ఆయనను, ఆయన భార్య శ్వేతాంబరిని గతేడాది డిసెంబర్‌లో అరెస్ట్ చేశారు. సుమారు రెండున్నర నెలల పాటు జైలులో ఉన్న ఈ దంపతులకు, ఫిబ్రవరి 19న సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇది కేవలం వాణిజ్యపరమైన లావాదేవీల వివాదం అని భావించిన కోర్టు, ఈ సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.