లక్షల గొంతుకల పోరాటం.. 15 ఏళ్ల కిందటి ఉద్యమ ఘట్టం: మిలియన్ మార్చ్‌ను స్మరించుకున్న కేటీఆర్

  • మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ స్పెష‌ల్ పోస్టు
  • తెలంగాణ ఉద్యమంలో అదొక కీలక ఘట్టమని వెల్లడి
  • నిర్బంధాలు ఉద్యమకారుల స్ఫూర్తిని ఆపలేకపోయాయని వ్యాఖ్య
  • ట్యాంక్‌బండ్‌పై లక్షల గొంతుకలు గర్జించాయని పోస్టులో పేర్కొన్న కేటీఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టమైన ‘మిలియన్ మార్చ్’కు నేటితో 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన అద్భుత పోరాట రూపాల్లో ఇదొకటని ఆయన పేర్కొన్నారు.

ఆయన 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్‌ను స్మరించుకున్నారు. "స్వరాష్ట్ర సాధన కోసం ట్యాంక్‌బండ్‌పై యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై గర్జించి నేటికి 15 ఏళ్లు. నిర్బంధాలు, దిగ్బంధాలు, అడ్డంకులు, బ్యారికేడ్లు, ఇనుపకంచెలు ఏవీ తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయి" అని కేటీఆర్ తన పోస్టులో రాసుకొచ్చారు. స్వరాష్ట్రం కోసం లక్షల గొంతుకలు ట్యాంక్‌బండ్‌పై ఏకమై నినదించిన అద్భుత పోరాటానికి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు.

ఈ సందర్భంగా కేటీఆర్ తన పోస్టుకు ఆనాటి మిలియన్ మార్చ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను జతచేశారు. "తెలంగాణ అమరవీరులకు జోహార్లు, జై తెలంగాణ" అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. 


More Telugu News