Stranded Indians: పశ్చిమాసియా సంక్షోభం.. యూఏఈలో చిక్కుకున్న భారతీయులకు ఎన్నారైల అండ

Indian Businessman In Dubai Opens His 64 Unit Apartment For Stranded Indians
  • ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన ఇద్దరు ఎన్నారై వ్యాపారవేత్తలు
  • దుబాయ్‌లో 64 అపార్ట్‌మెంట్లను ఉచితంగా కేటాయించిన యోగేశ్‌ దోషి
  • ఫామ్‌హౌస్‌ను షెల్టర్‌గా మార్చి, రోల్స్ రాయిస్ కార్లలో తరలిస్తున్న ధీరజ్ జైన్
  • భారత కాన్సులేట్ సహకారంతో 125 మందికి పైగా బాధితులకు ఆశ్రయం
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య, యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను ఆదుకునేందుకు ఇద్దరు ఎన్నారై వ్యాపారవేత్తలు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. ప్రయాణాలు రద్దవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తోటి భారతీయులకు ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తూ తమ ఉదారతను చాటుకున్నారు.

దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అల్ మిజాన్ గ్రూప్ ఛైర్మన్ యోగేశ్‌ దోషి, ఆపదలో ఉన్న భారతీయుల కోసం తన 64 అపార్ట్‌మెంట్ల రెసిడెన్షియల్ భవనాన్ని పూర్తిగా కేటాయించారు. భారత కాన్సులేట్, ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు పిల్లలతో ఉన్న కుటుంబాలతో పాటు 125 మందికి పైగా భారతీయులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించామని ఆయన తెలిపారు. బాధితులకు ఉచితంగా వసతితో పాటు ఆహారాన్ని కూడా అందిస్తున్నారు.

ఈ సాయం తమకు సరైన సమయంలో అందిందని పలువురు బాధితులు ఎన్డీటీవీకి తెలిపారు. మోహిత్ వచాని, రియా మకాడియా, పారస్ భలోడియా, గ్రిష్మా భలోడియా తదితరులు మాట్లాడుతూ.. తమ హోటల్ బస ముగిసిపోవడం, దాన్ని పొడిగించే అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని చెప్పారు. మరోవైపు ఫోన్లకు నిరంతరం వస్తున్న భద్రతా హెచ్చరికల వల్ల ఆందోళన మరింత పెరిగిందన్నారు. "మేము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వసతి గురించి తెలిసింది. ఇది మాకు భారీ ఊరటనిచ్చింది" అని వారు పేర్కొన్నారు.

ఇదే తరహాలో దుబాయ్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోని అజ్మాన్‌లోనూ మరో భారత వ్యాపారవేత్త ధీరజ్ జైన్ తన పెద్ద ఫామ్‌హౌస్‌ను తాత్కాలిక షెల్టర్‌గా మార్చారు. డబ్బులు, ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడుతున్న అనేక మందికి ఇక్కడ ఉచితంగా వసతి, భోజనం అందిస్తున్నారు. అంతేకాకుండా చిక్కుకుపోయిన ప్రయాణికులను హోటళ్లు, ఇతర ప్రాంతాల నుంచి తన ఫామ్‌హౌస్‌కు తీసుకురావడానికి 6 రోల్స్ రాయిస్ కార్లతో పాటు మొత్తం 11 వాహనాలను ఆయన ఏర్పాటు చేయడం విశేషం.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరపడం, ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖ‌మేనీ మరణించడంతో పశ్చిమాసియా, మధ్యప్రాచ్యం ప్రాంతాలలో యుద్ధ వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి ఇరాన్.. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తుండగా, అమెరికా-ఇజ్రాయెల్ దళాలు కూడా ప్రతిదాడులకు దిగుతున్నాయి. ఈ సంక్షోభ సమయంలో తోటి భారతీయులకు అండగా నిలుస్తున్న ఈ ఎన్నారైల చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.
Stranded Indians
Indian Expats
Yogesh Doshi
UAE
Middle East crisis
Dubai
Dheeraj Jain
Nri help
Ajman
Travel disruption

More Telugu News