Bandi Sanjay: విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ విమర్శలు

Bandi Sanjay Criticizes Revanth Reddys Electric Scooter Promise
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్న సంజయ్
  • పెన్షన్లు ఇవ్వడానికి నిధులు లేవని సాకులు చెబుతున్నారని మండిపాటు
  • మూసీ ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్న

కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం ఈ కీలక ప్రకటన చేయగా, దీనిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ 'ఎక్స్' వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎటు వెళుతున్నాయో అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు.


బండి సంజయ్ తన విమర్శల్లో ప్రధానంగా కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రస్తావించారు. ఓవైపు వేల కోట్ల ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయని, దీని కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు, అవేమీ పట్టించుకోకుండా ఉచిత ఈవీ స్కూటర్లు ఇస్తామని వాగ్దానాలు చేయడం ప్రజలను వంచించడమేనని ధ్వజమెత్తారు. దళితులు, గిరిజనులకు పంపిణీ చేయడానికి భూములు లేవని చెబుతున్న ప్రభుత్వం, జర్నలిస్టులు, మూసీ బాధితులకు ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. పెన్షన్లు ఇవ్వడానికి నిధులు లేవని సాకులు చెబుతున్నారని... మరి, మూసీ ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు.


రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు దోమల బెడద పెరిగిందని... ప్రజలు తమ పని తాము చేసుకుంటున్నా, కాంగ్రెస్ నేతలు దోమల్లా వచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay
Revanth Reddy
Telangana
Electric Scooters
Fee Reimbursement
Student Issues
Political Criticism
BJP
Congress
Telangana Politics

More Telugu News