Denis Alipov: భారత్‌కు ఎలాంటి సమయంలోనైనా చమురు సరఫరా చేయడానికి మేం సిద్ధం: రష్యా ప్రకటన

Denis Alipov Russia ready to supply oil to India anytime
  • అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నా భారత్‌కు ఆయిల్ ఇచ్చేందుకు సిద్ధమన్న రష్యా రాయబారి
  • సరఫరాదారులు ఎవరనేది నిర్ణయించుకోవాల్సింది భారతదేశమే అన్న అలిపోవ్
  • అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారంటూ అమెరికా తీరుపై మండిపాటు
  • ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్చకు రష్యా సంసిద్ధత
పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళనల నడుమ రష్యా కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్‌కు ముడి చమురు సరఫరా చేసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నామని భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేడు న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన అలిపోవ్.. చమురు సరఫరాదారులు ఎవరనేది నిర్ణయించుకోవాల్సింది భారత నాయకత్వమేని, అయితే రష్యా మాత్రం భారత్‌కు ఆయిల్ ఇచ్చేందుకు ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని భరోసా ఇచ్చారు.

పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఘర్షణలపై స్పందిస్తూ, సమస్య ఏదైనా చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని అలిపోవ్ అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా ఈ ఘర్షణలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో యుద్ధం ఇంకెంత కాలం కొనసాగుతుందని విలేకరులు ప్రశ్నించగా.. "ఆ విషయం నాకేం తెలుసు? ఈ ప్రశ్నకు సమాధానం నాకంటే అమెరికాకే బాగా తెలుసు" అని ఆయన వ్యంగ్యంగా బదులిచ్చారు. 

మరోవైపు, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సాయుధ దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. పరిస్థితిని తిరిగి రాజకీయ, దౌత్యపరమైన పరిష్కార మార్గంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో శనివారం ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన శాంతియుత చర్చలకు విఘాతం కలిగించేలా అమెరికా, ఇజ్రాయెల్ వ్యవహరించాయని, వారి దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు ఇరాన్ నాయకత్వం తీసుకుంటున్న చర్యలను అరాఘ్చీ వివరించారు. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.

దీనిపై స్పందించిన రష్యా విదేశాంగ మంత్రి లావ్‌రోవ్.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ చట్టాల సూత్రాలకు, నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి ఇవి తీవ్ర ముప్పు అని, పర్యవసానాలను పూర్తిగా విస్మరించి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇరాన్‌పై దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పరస్పర గౌరవం, అంతర్జాతీయ చట్టాల ఆధారంగా శాంతియుత పరిష్కారాల కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా కృషి చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని లావ్‌రోవ్ హామీ ఇచ్చారు.

ఇటీవల ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేయడంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సహా పలువురు అగ్రనాయకులు మరణించడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా డ్రోన్, క్షిపణి దాడులతో అమెరికా స్థావరాలు, మిత్రపక్షాల బలగాలపై విరుచుకుపడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా రాయబారి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


Denis Alipov
Russia
India
crude oil supply
oil prices
Iran
Israel
US
West Asia conflict
Sergei Lavrov

More Telugu News