పశ్చిమాసియా రణరంగం... అమెరికా ఎంబసీలను టార్గెట్ చేసిన ఇరాన్

  • సౌదీలోని అమెరికా దౌత్య కార్యాలయంపై ఇరాన్ డ్రోన్ల దాడి
  • బహ్రెయిన్, ఒమన్‌లలోని అమెరికా స్థావరాలపైనా విరుచుకుపడ్డ ఇరాన్
  • టెహ్రాన్, బీరుట్ లలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ విధ్వంసకాండ
  • అంతర్జాతీయంగా ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలు
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా కూటమి దాడులతో ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఇరాన్ విరుచుకుపడుతోంది.

యుద్ధం నాలుగో రోజుకు చేరుకోగా.. ఇరాన్ తన వ్యూహాన్ని మార్చింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఉన్న అమెరికన్ ఎంబసీపై రెండు డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఎంబసీ ఆవరణలో మంటలు చెలరేగగా, భవనానికి స్వల్ప నష్టం వాటిల్లింది. దౌత్య కార్యాలయాలపైనే నేరుగా దాడులు జరగడం యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు ఒమన్‌లోని దుక్మ్ పోర్ట్‌పై కూడా డ్రోన్ దాడి జరగడంతో ఇంధన ట్యాంక్ దెబ్బతింది. అలాగే బహ్రెయిన్‌లోని అమెరికన్ ఎయిర్ బేస్‌లో ఉన్న ఓ కమాండ్ భవనాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని ఇరాన్ మీడియా ప్రకటించింది. హార్ముజ్ జలసంధిలో నౌకలను మంటల్లో కలిపేస్తామంటూ ఇరాన్ అధికారులు హెచ్చరించారు.

మరోవైపు ఇజ్రాయెల్ తన దాడులను ఏమాత్రం తగ్గించడం లేదు. ఇజ్రాయెల్ వైమానిక దళం మంగళవారం కూడా టెహ్రాన్‌లోని సైనిక లక్ష్యాలపై విరుచుకుపడింది. టెహ్రాన్ తూర్పున ఉన్న పార్డిస్ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించగా, నగరం మొత్తం పొగతో నిండిపోయింది. ఇజ్రాయెల్ అటు లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివార్లలోనూ భవనాలను నేలమట్టం చేస్తోంది. దీనికి దీటుగా హిజ్బుల్లా కూడా గోలాన్ హైట్స్, మెరాన్, రమత్ డేవిడ్ వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది.

ఈ యుద్ధం కారణంగా సామాన్యులు బలవుతున్నారు. ఇరాన్‌లో ఇప్పటివరకు 787 మంది మరణించగా, అందులో 176 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. అటు అమెరికా వైపు ఆరుగురు సైనికులు మరణించారు. అమెరికా సైనికుల మరణాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ కూడా ధృవీకరించింది.

ఖతార్, సౌదీలో చమురు ఉత్పత్తికి అంతరాయం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. సోమవారం 50 శాతం పెరిగిన ధరలు, మంగళవారం మరో 33 శాతం పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.

ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని అమెరికా మంత్రి మార్కో రుబియో హెచ్చరించగా, టెహ్రాన్‌పై పూర్తి శక్తితో విరుచుకుపడతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పష్టం చేశారు. 


More Telugu News