ఇరాన్ యుద్ధ విమానాలను కూల్చివేసిన ఖతార్
- పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం
- ఇరాన్ దాడులను ఖండిస్తూ గల్ఫ్ దేశాల ఉమ్మడి ప్రకటన
- ఎదురు దాడికి వెరవబోమని ఇరాన్ కు హెచ్చరిక
- యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్ లో 555 మంది మృతి
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ ల దాడులకు ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన దాడులు గల్ఫ్ దేశాలను వణికిస్తున్నాయి. ఈ క్రమంలో ఖతార్ గగనతలంలోకి దూసుకొచ్చిన ఇరాన్‌కు చెందిన రెండు ఎస్ యూ-24 యుద్ధ విమానాలను ఖతార్ వైమానిక దళం కూల్చివేసింది. తమ దేశంపైకి దూసుకొస్తున్న ఇరాన్ యుద్ధ విమానాలను గుర్తించిన వెంటనే కూల్చివేసినట్లు ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు 7 బాలిస్టిక్ క్షిపణులను నావికా, వైమానిక దళాలు ధ్వంసం చేశాయి. 5 ఇరాన్ డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నాయి. ‘‘లక్ష్యాలను చేరుకోకముందే అన్ని క్షిపణులను కూల్చివేశాం’’ అని అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడిలో 16 మందికి గాయాలైనట్లు సమాచారం.
గల్ఫ్ దేశాల్లో పేలుళ్ల హోరు
ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడులతో దుబాయ్, దోహా, కువైట్ సిటీలలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. కువైట్ సిటీలోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో పొగలు కమ్ముకున్నాయి. రుమైతియా, సాల్వా ప్రాంతాల్లో డ్రోన్లను అడ్డుకున్నట్లు కువైట్ వార్తా సంస్థ తెలిపింది. డమ్మమ్ సమీపంలోని రాస్ తనూరా రిఫైనరీపై డ్రోన్ దాడి జరగడంతో చమురు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. అక్కడ చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చారు. బహ్రెయిన్ రాజధాని మనామాలో ఎయిర్ రైడ్ అలర్ట్‌లు జారీ చేశారు. ప్రధాన వంతెనలను మూసివేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. హోటళ్లపై దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా ఎంబసీ హెచ్చరించింది.
ప్రాణనష్టం వివరాలు
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ లో 555 మంది మృతి. ఇజ్రాయెల్ లో 9 మంది మృతి, 121 మందికి గాయాలు. కువైట్‌లో ఒకరు, యూఏఈలో ముగ్గురు మరణించారు.
ఉమ్మడి పోరుకు సిద్ధమైన గల్ఫ్ దేశాలు
బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు ఆదివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ, తమ పౌరుల రక్షణ కోసం ‘‘అవసరమైన అన్ని చర్యలు’’ తీసుకుంటామని, ఎదురుదాడి చేసే ఆప్షన్ కూడా తమ దగ్గర ఉందని హెచ్చరించాయి.