ఇరాన్‌పై దాడికి ముందు 74 సార్లు హెచ్చరించిన ట్రంప్

  • ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండరాదన్న ట్రంప్
  • ఈ విషయంలో దశాబ్దాలుగా ఆయన వైఖరి స్థిరమన్న వైట్‌హౌస్
  • గత 15 ఏళ్లలో 74 సార్లు ఇదే విషయాన్ని చెప్పినట్లు వెల్లడి
  • ఉగ్రవాదానికి స్పాన్సర్‌గా ఉన్న దేశానికి అణుబాంబు ఇవ్వనన్న ట్రంప్
  • అధ్యక్ష పదవికి రాకముందు నుంచే ఇదే మాట చెబుతున్నారని స్పష్టీకరణ
ఇరాన్‌పై సైనిక చర్యల దిశగా ఆలోచన చేస్తున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మరోసారి ప్రపంచానికి స్పష్టం చేశారు. ఇరాన్‌ను అణ్వాయుధాలు కలిగి ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తాను దశాబ్దాలుగా చెబుతున్న మాటనూ గుర్తుచేశారు. ఈ విషయంలో ట్రంప్ మొదటి నుంచీ ఒకే వైఖరితో స్థిరంగా ఉన్నారని వైట్‌హౌస్ సోమవారం ప్రకటించింది. ఇందుకు నిదర్శనంగా గత 15 ఏళ్లలో ఆయన చేసిన 74 కీలక ప్రకటనల జాబితాను విడుదల చేసింది.

ట్రంప్ వ్యాఖ్యల్లో భాష మారినా, ఉద్దేశం మాత్రం ఎప్పుడూ మారలేదని ఈ జాబితా స్పష్టం చేస్తోంది. "ఉగ్రవాదానికి ప్రపంచంలోనే నంబర్ వన్ స్పాన్సర్‌గా ఉన్న ఇరాన్‌ను అణ్వాయుధాలు కలిగి ఉండటానికి నేను ఎప్పటికీ అనుమతించను" అని ట్రంప్ ఫిబ్రవరి 24, 2026న అన్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది. అంతకుముందు కూడా "వారికి అణ్వాయుధాలు ఉండకూడదు. మధ్యప్రాచ్యంలో శాంతికి అదే అడ్డంకి" వంటి  వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు "అణ్వాయుధాలు" అని క్లుప్తంగా చెప్పిన సందర్భాలూ ఉన్నాయి.

ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టక ముందు నుంచే ఈ విషయంపై స్పష్టతతో ఉన్నారు. "ఇరాన్‌ను అణుశక్తిగా మారడానికి మనం అనుమతించలేం" అని 2011 నవంబర్‌లోనే ఆయన వ్యాఖ్యానించారు. సభలు, ఇంటర్వ్యూలు, అధికారిక ప్రకటనల్లో పదజాలం మారినా, ఇరాన్ అణుబాంబును సమకూర్చుకోకూడదన్న ప్రధాన డిమాండ్ మాత్రం మారలేదని వైట్‌హౌస్ వివరించింది. యురేనియం శుద్ధి, ఆంక్షలు, తనిఖీల విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.


More Telugu News