దుబాయ్ ఎయిర్ పోర్టులో పాక్షికంగా కార్యకలాపాలు ప్రారంభం

  • నేటి సాయంత్రం నుంచి పరిమిత సంఖ్యలో విమాన సర్వీసుల ప్రారంభం
  • ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణికులకే తొలి ప్రాధాన్యం
  • విమానయాన సంస్థల నుంచి సమాచారం వస్తేనే ఎయిర్‌పోర్టుకు రావాలి
  • ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా నిలిచిన రాకపోకలు
  • పూర్తి స్థాయి సేవల పునరుద్ధరణపై ఇంకా రాని స్పష్టత
అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో నిలిచిపోయిన విమాన సర్వీసులు యూఏఈలో పాక్షికంగా తిరిగి ప్రారంభమయ్యాయి. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి కార్యకలాపాలు పునరుద్ధరించినట్లు అధికారులు ధృవీకరించిన అనంతరం, ప్రముఖ విమానయాన సంస్థలు ఎమిరేట్స్, ఎతిహాద్ కీలక ప్రకటన చేశాయి. సోమవారం సాయంత్రం నుంచి పరిమిత సంఖ్యలో విమానాలను నడపనున్నట్లు ఈ సంస్థలు వెల్లడించాయి.

తమ సేవలను దశలవారీగా పునరుద్ధరిస్తున్నామని, ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఎమిరేట్స్ స్పష్టం చేసింది. అయితే, ఎయిర్‌లైన్స్ నుంచి నేరుగా సమాచారం లేదా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు రావాలని సూచించింది. లేకపోతే ఎయిర్‌పోర్టుకు రావద్దని విజ్ఞప్తి చేసింది. మరోవైపు, ఎతిహాద్ ఎయిర్‌వేస్ కూడా యూఏఈ అధికారుల సమన్వయంతో, కఠినమైన భద్రతా అనుమతులకు లోబడి కార్గో మరియు స్వదేశానికి చేర్చే విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది.

గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేయడంతో గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా దుబాయ్, అబుదాబి, దోహాల్లో వేల సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆసియా, ఐరోపా, అమెరికాల మధ్య కీలకమైన ఈ రూట్లలో రాకపోకలు స్తంభించడంతో ప్రపంచవ్యాప్తంగా విమాన నెట్‌వర్క్ దెబ్బతింది. అయితే, సాధారణ విమాన సర్వీసులు ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయనే దానిపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతానికి అత్యవసర మరియు పరిమిత విమానాలు మాత్రమే దుబాయ్ ఇంటర్నేషనల్, అల్ మక్తూమ్ ఎయిర్‌పోర్టుల నుంచి నడుస్తున్నాయి.


More Telugu News