US Iran War: ఇరాన్‌తో యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు కానీ ముగించేది మేమే: అమెరికా రక్షణ శాఖ కీలక ప్రకటన

US Defence Sec Hegseth on War
  • అణ్వాయుధాల విషయంలో ఇరాన్ మొండిగా వ్యవహరించిందన్న అమెరికా
  • ఖమేనీ అమెరికా హెచ్చరికలను లెక్కచేయలేదని విమర్శ
  • అణ్వాయుధాలను అంతం చేయడమే తమ లక్ష్యమన్న అమెరికా
ఇరాన్‌తో యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అయినప్పటికీ ముగింపు పలికేందుకు తామేనని అమెరికా కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఉద్రిక్తతలు తగ్గించేందుకు సిద్ధమని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని పేర్కొంది.

అణ్వాయుధాల విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్ మొండిగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అణ్వాయుధాల తయారీని కొనసాగిస్తూ వచ్చిందని తెలిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తమ హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయలేదని పేర్కొంది. అంతేకాకుండా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ చేతిలో చావు తప్పదని హెచ్చరిక చేశారని తెలిపింది. కానీ ఇప్పుడు ఈ యుద్ధంలో ఖమేనీయే హతమయ్యారని ఆ ప్రకటనలో వెల్లడించింది.

యుద్ధం ఇరుపక్షాలకు నష్టం చేకూరుస్తుందని అమెరికా రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. తాము యుద్ధానికి సిద్ధమైంది ఇరాన్‌లో పాలన మార్చాలనే ఉద్దేశంతో కాదని, కేవలం అణ్వాయుధాలను అంతం చేసేందుకే దాడులు చేశామని తెలిపింది. అణు స్థావరాలను నాశనం చేయడమే తమ లక్ష్యమని పేర్కొంది. యుద్ధం మేం ప్రారంభించనప్పటికీ ట్రంప్ నాయకత్వంలో దీనిని ముగిస్తామని తెలిపింది. 

దాదాపు 40 ఏళ్లుగా ఇరాన్ అమెరికాపై పరోక్ష యుద్ధం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశం అన్ని హద్దులు దాటినందువల్లే శిక్షిస్తున్నామని స్పష్టం చేసింది. ఇరాన్ పై జరుగుతున్న ఈ దాడులు ఇరాక్ యుద్ధం లాగా ఏళ్ల తరబడి సాగేది కాదని, ఇదో నిర్ణయాత్మక మిషన్ అని పేర్కొంది. పొరుగు దేశాల్లో ప్రజలపై దాడుల ద్వారా ఇరాన్ నిజస్వరూపం బయటపడిందని ఆరోపించింది. అణు కార్యక్రమాలపై హెచ్చరికలు చేసినప్పటికీ, మరింత రెచ్చగొడుతూ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తామని చెప్పిందని మండిపడింది. ఈ అవకాశాన్ని ఇరాన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అమెరికన్లను ఎక్కడైనా బెదిరించినా లేదా చంపినా అలాంటి వారిని వేటాడి మరీ అంతం చేస్తామని హెచ్చరించింది.
US Iran War
US Israel Iran War
us defence

More Telugu News