Health Insurance: ఆరోగ్య బీమా రంగం... చైనా కంటే వెనుకబడి ఉన్న భారత్!

Health Insurance Sector India lags behind China Aon Report
  • భారత్‌లో 50 శాతం ఇన్సూరెన్స్ సంస్థలే కస్టమైజేషన్ సపోర్ట్ ఇస్తున్న వైనం
  • చైనాలో ఇది 92 శాతంగా ఉందని ఏయాన్ నివేదిక వెల్లడి
  • దేశంలో వేగంగా పెరుగుతున్న టెలీహెల్త్ సేవల వినియోగం
  • అవగాహన లోపం, ధరల విషయంలో ఇంకా సవాళ్లు ఉన్నాయి
భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం వేగంగా డిజిటలైజ్ అవుతున్నప్పటికీ, క్లయింట్లకు అవసరమైన విధంగా సేవలందిచడంలో (కస్టమైజేషన్) ఇంకా వెనుకబడే ఉందని ప్రముఖ సంస్థ 'ఏయాన్' తన తాజా నివేదికలో వెల్లడించింది. సోమవారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. 1,000 కంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలకు కస్టమైజేషన్ సపోర్ట్ అందించడంలో చైనాలోని 92 శాతం బీమా సంస్థలతో పోలిస్తే, భారత్‌లో కేవలం 50 శాతం సంస్థలు మాత్రమే ముందంజలో ఉన్నాయి.

భారత హెల్త్ ఇన్సూరెన్స్ రంగం కవరేజీని విస్తరిస్తున్నప్పటికీ.. అవగాహన లేకపోవడం, సేవల ప్రమాణాలు, సామాన్యులకు అందుబాటు ధరలు వంటి విషయాల్లో ఇంకా సవాళ్లను ఎదుర్కొంటోందని నివేదిక పేర్కొంది. దీనిపై ఏయాన్ ఏపీఏసీ వెల్బీయింగ్ సొల్యూషన్స్ హెడ్ సూసన్ ఫ్యానింగ్ మాట్లాడుతూ, "భారత హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్రస్తుతం అత్యంత కీలక దశలో ఉంది. యజమానులు, ఉద్యోగుల నుంచి అంచనాలు పెరుగుతున్నాయి. ఖర్చులను అదుపులో ఉంచుతూనే, మెరుగైన ఫలితాలను అందించేందుకు బీమా సంస్థలు వినూత్న మార్గాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది" అని అభిప్రాయపడ్డారు.

దేశంలో టెలీహెల్త్ సేవలు బాగా విస్తరించాయని, సర్వే చేసిన వాటిలో 83 శాతం బీమా సంస్థలు జనరల్ ఫిజీషియన్ కన్సల్టేషన్లు, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ, ఈ-ప్రిస్క్రిప్షన్ వంటి సేవలను అందిస్తున్నాయని రిపోర్ట్ తెలిపింది. అయితే, వీటి వల్ల అవుతున్న ఖర్చు ఆదా మాత్రం చాలా తక్కువగా (1.1 నుంచి 1.5 శాతం మాత్రమే) ఉందని పేర్కొంది. 

అలాగే, 67 శాతం సంస్థలు ఫోన్, ఆన్‌లైన్ ద్వారా ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఈఏపీ) సేవలను అందిస్తున్నాయని, అయితే వీటి వినియోగం ఇంకా పెరగాల్సి ఉందని నివేదిక స్పష్టం చేసింది. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో, స్థానిక అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేస్తేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచించింది.
Health Insurance
Aon Report
India
China
Healthcare
Employee Assistance Program
Telehealth
Digitalization
Insurance Services

More Telugu News