Ayatollah Ali Khamenei: మరణానికి కొద్ది నిమిషాల ముందు ఖురాన్ వాక్యంతో ఖమేనీ పోస్ట్.. ‘‘దైవానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా’’

Khamenei last post Quran quote before death
  • ‘అమరవీరుడిని’ అవుతున్నానంటూ సంకేతం
  • అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ సహా 40 మంది ఉన్నతాధికారుల మృతి
  • ఇరాన్ ప్రతీకార దాడితో గల్ఫ్ అతలాకుతలం.. అబుదాబి, దుబాయ్‌లపై క్షిపణుల వర్షం
‘‘విశ్వాసులలో కొందరు దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.. మరికొందరు ఆ సమయం కోసం వేచి చూస్తున్నారు’’.. మరణానికి కొద్ది నిమిషాల ముందు ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన ఖురాన్ వాక్యం ఇది. 86 ఏళ్ల ఖమేనీ, శనివారం జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. తన మరణం తథ్యమని తెలిసి ఆయన చేసిన ఈ చివరి పోస్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వారసత్వ పోరు..

1989 నుంచి ఇరాన్ విధి రాతను శాసించిన ఖమేనీ మరణంతో ఆ దేశంలో 35 ఏళ్ల శకం ముగిసింది. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన ‘లయన్స్ రోర్’ ఆపరేషన్‌లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, మనవరాలు సహా పలువురు కీలక సేనాధిపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో ఇరాన్ పాలక వర్గంలో పెను మార్పులు రాబోతున్నాయి. అధికార మార్పిడి కోసం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇప్పటికే రంగంలోకి దిగింది.

మహా యుద్ధం మొదలైందా..

ఖమేనీ మరణ వార్త బయటకు వచ్చిన వెంటనే ఇరాన్ ప్రతీకార జ్వాలలతో రగిలిపోయింది. ‘ట్రూ ప్రామిస్ 4’ పేరుతో అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లపై వందలాది క్షిపణులను ప్రయోగించింది. అంతర్జాతీయ విమానాశ్రయాలపై డ్రోన్ దాడులు జరగడంతో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. యూఏఈ ప్రభుత్వం ప్రజలకు అత్యవసర ‘మిస్సైల్ అలర్ట్’ జారీ చేసి, షెల్టర్లలోకి వెళ్లాలని ఆదేశించింది.

సంతాప దినాలు.. సంబరాలు..
ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల సంతాప దినాలను ప్రకటించగా, మరోవైపు ఇరాన్ పౌరులు తమ దేశ స్వేచ్ఛ కోసం రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ పశ్చిమ ఆసియాలో రేగబోయే ఈ మహా సంగ్రామం గురించి ఆందోళన చెందుతున్నాయి.
Ayatollah Ali Khamenei
Khamenei
Iran
Iran supreme leader
Middle East conflict
US Israel relations
Iran Revolutionary Guard
Operation Lions Roar
True Promise 4
missile attacks

More Telugu News