Anvesh: ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటుపై రేవంత్ ప్రభుత్వానికి యూట్యూబర్ అన్వేష్ మద్దతు

YouTuber Anvesh Supports Revanth Government on Gandhi Statue
  • మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఎత్తైన గాంధీ విగ్రహ నిర్మాణం
  • విగ్రహ ఏర్పాటుపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు
  • ఈ విగ్రహం కారణంగా తెలంగాణకు భారీ ఆదాయం వస్తుందన్న అన్వేష్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న ‘మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్’ ప్రాజెక్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి పూర్తి మద్దతు ప్రకటించాడు. విగ్రహాల ఏర్పాటును కేవలం రాజకీయ కోణంలో చూడకూడదని, వాటి వెనుక ఉండే పర్యాటక ఆర్థిక సూత్రాన్ని గమనించాలని పిలుపునిచ్చాడు.


గుజరాత్‌లోని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని ఉదాహరణగా చూపిస్తూ అన్వేష్ ఆసక్తికర విశ్లేషణ చేశాడు. నాడు సర్దార్ పటేల్ విగ్రహం కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే విమర్శించిన వారు... ఆ విగ్రహం కారణంగా ఇప్పటి వరకు వచ్చిన రూ. 800 కోట్ల ఆదాయాన్ని గమనించాలని గుర్తుచేశాడు. ఇప్పుడు హైదరాబాద్‌లో రూ. 5 వేల కోట్లతో నిర్మించబోయే గాంధీ విగ్రహం కూడా భవిష్యత్తులో తెలంగాణకు కామధేనువులా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. థాయ్‌లాండ్ వంటి దేశాలు కేవలం పర్యాటక రంగం ద్వారానే లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని, అభివృద్ధి జరగాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని అభిప్రాయపడ్డాడు.


"నేను ఏ పార్టీకి తొత్తును కాదు. రేపు కేసీఆర్ విగ్రహం కట్టినా, ఏపీలో ఎన్టీఆర్ విగ్రహం కట్టినా నా మద్దతు అభివృద్ధి వైపే ఉంటుంది" అని అన్వేష్ స్పష్టం చేశాడు. పర్యావరణం లేదా ఇతర సాకులు చెప్పి అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని అన్నాడు. 150 దేశాల పర్యాటక అనుభవంతో చెబుతున్నానని, ప్రపంచంలో ఎక్కడైనా ముందు టూరిజం స్పాట్‌ను డెవలప్ చేశాకే మౌలిక సదుపాయాలు వస్తాయని వివరించాడు. ఎవరు అడ్డుకున్నా రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారని, విమర్శించే వారు కాలక్రమేణా మౌనంగా ఉండిపోక తప్పదని వ్యాఖ్యానించాడు.


అయితే, ఇదే సమయంలో ప్రభుత్వానికి అన్వేష్ ఒక కీలక విజ్ఞప్తి చేశాడు. పర్యాటక అభివృద్ధి పేరుతో సామాన్య ప్రజల ఇళ్లను కూల్చడం, వారిని ఇబ్బందులకు గురిచేయడం వంటివి చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని సూచించాడు.

Anvesh
Revanth Reddy
Gandhi Statue Hyderabad
Moosi Riverfront Development
Statue of Unity
Telangana Tourism
Travel YouTuber
Tourism Revenue
KCR
NTR

More Telugu News