KV Rajendranath Reddy: ఏపీ సీఎస్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. జైలుకు పంపాల్సి వస్తుందని హెచ్చరిక

High Court Threatens CS With Jail Over Non Compliance in Group 1 Case
  • గ్రూప్-1 కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
  • ఆదేశాల అమలులో జాప్యంపై నిప్పులు చెరిగిన ధర్మాసనం
  • కోర్టు ధిక్కరణ కింద జైలుకు పంపాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరిక
  • ప్రభుత్వ వాదనను తోసిపుచ్చి, గురువారానికి గడువు విధించిన కోర్టు
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. విజయానంద్‌పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో తీవ్ర జాప్యం చేయడంపై బుధవారం జరిగిన విచారణలో ధర్మాసనం నిప్పులు చెరిగింది. "తక్షణం అనే పదానికి అర్థం తెలియదా?" అని ఘాటుగా ప్రశ్నిస్తూ, కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది.

గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం గ్రూప్-1 ద్వారా ఎంపికైన వారిని దర్యాప్తును ప్రభావితం చేయని అప్రాధాన్య (నాన్-ఫోకల్) పోస్టుల్లోకి తక్షణం బదిలీ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఆ ఆదేశాలు అమలు కాకపోవడంపై ధర్మాసనం సీఎస్‌ను నిలదీసింది. "మీరు పదవీ విరమణకు దగ్గరగా ఉన్నారు. మిమ్మల్ని నాలుగు రోజులు జైల్లో ఉంచితే మిగిలిన అధికారులు దారిలోకి వస్తారు. కోర్టు ఆదేశాలను సీఎస్ గౌరవించకపోతే కింది స్థాయి అధికారులు ఏం నేర్చుకుంటారు?" అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీల వంటి కీలక పోస్టుల్లో ఉన్నవారిని బదిలీ చేయడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. "అభ్యర్థులు మిమ్మల్ని మేనేజ్ చేశారా? లేక మీరు వారితో కుమ్మక్కయ్యారా?" అంటూ సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. ఫోకల్, నాన్-ఫోకల్ పోస్టుల నిర్వచనంపై స్పష్టత లేనందునే న్యాయసలహా కోరామని తెలిపారు. ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. "ఏఐని అడిగినా ఆ పదాలకు అర్థం చెబుతుంది, మీకే తెలియదా?" అని ఎద్దేవా చేసింది.

"జైలుకు వెళ్తారా? లేక ఆదేశాలు అమలు చేస్తారా?" అని సీఎస్‌ను ధర్మాసనం నిలదీయగా.. గురువారం నాటికి ఉత్తర్వులు అమలు చేసి నివేదిక సమర్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మలతో కూడిన ధర్మాసనం ఈ హామీని నమోదు చేసుకుని, విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆదేశాలు అమలు చేస్తే సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
KV Rajendranath Reddy
AP High Court
IAS officer
court contempt
Group 1 appointments
YS Jagan government
Andhra Pradesh
non focal posts
officer transfer
court orders

More Telugu News