బెంగళూరు అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్

  • బెంగళూరు గ్యాంగ్ రేప్ కేసులో ఊహించని మలుపు
  • బాధితురాలితో పాటు ఓ జర్నలిస్టుపై నిందితుడి ఎదురు ఫిర్యాదు
  • డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని నిందితుడు ఆరోపణ
  • డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశారంటూ యువతి కంప్లైంట్
బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి.. బాధితురాలితో పాటు ఓ జర్నలిస్టుపైనే ఎదురు ఫిర్యాదు చేయడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. డబ్బుల కోసం తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తూ నిందితుడు నిఖిల్ హెచ్.డి. (34) ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లేశ్వరం పోలీసులు బాధితురాలు, ఇమ్రాన్ అనే జర్నలిస్టుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలు ఫిబ్రవరి 22న అత్యాచారంపై ఫిర్యాదు చేయగా, నిఖిల్ అంతకుముందే ఫిబ్రవరి 21న పోలీసులను ఆశ్రయించడం గమనార్హం.

నిఖిల్ తన ఫిర్యాదులో పలు కీలక విషయాలు వెల్లడించాడు. తాను సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తానని, జక్కూరులో ఓ విల్లాను లీజుకు తీసుకుని రోజువారీ అద్దెకు ఇస్తానని తెలిపాడు. వాలెంటైన్స్ డే పార్టీ కోసం తన స్నేహితుడు డిక్సన్ ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు ఆ విల్లాను బుక్ చేసుకున్నాడని చెప్పాడు. పార్టీకి తాను కూడా వెళ్లానని, అక్కడ బాధితురాలు తనతో చనువుగా ప్రవర్తించిందని, తన కుటుంబ సమస్యలు చెప్పిందని పేర్కొన్నాడు. కారులో డ్రాప్ చేస్తున్నప్పుడు, తాను 'షుగర్ బేబీ' అని, తనకు 'షుగర్ డాడీ' కావాలని ఆమె చెప్పిందని నిఖిల్ ఆరోపించాడు.

ఆ తర్వాత కొద్దిరోజులకు ఇమ్రాన్ అనే వ్యక్తి, తాను ఓ కన్నడ న్యూస్ ఛానెల్ క్రైమ్ చీఫ్‌నని చెబుతూ ఫోన్ చేశాడని నిఖిల్ తెలిపాడు. బాధితురాలికి డబ్బులు ఇచ్చి న్యాయం చేయాలని, లేదంటే ఛానెల్‌లో వార్తలు ప్రసారం చేసి తన పరువుతీస్తానని బెదిరించాడని ఆరోపించాడు. ఈ క్రమంలోనే తాను పోలీసులను ఆశ్రయించినట్టు వివరించాడు. ఈ మేరకు పోలీసులు బాధితురాలు, జర్నలిస్టుపై ఐటీ యాక్ట్‌తో పాటు దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు, 19 ఏళ్ల బాధితురాలు తన బాయ్‌ఫ్రెండ్ డిక్సన్, అతని స్నేహితుడు నిఖిల్ కలిసి డ్రగ్స్ ఇచ్చి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వాలెంటైన్స్ డే పార్టీలో బలవంతంగా నోట్లో రోజ్ కలర్ టాబ్లెట్ వేశారని, కొద్దిసేపటికే తనకు స్పృహ తప్పిందని ఆరోపించింది. స్పృహలోకి వచ్చి చూసేసరికి నిఖిల్ తన పక్కనే ఉన్నాడని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఘటన గురించి బయట చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిఖిల్ బెదిరించాడని కూడా తెలిపింది.

ఈ పరస్పర విరుద్ధమైన ఫిర్యాదులతో పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఒకవైపు అత్యాచారం ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత కింద, మరోవైపు బ్లాక్‌మెయిల్ ఆరోపణలపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రెండు కేసులపైనా లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని, నిజానిజాలు తేలుస్తామని అధికారులు వెల్లడించారు.


More Telugu News