మత్తు మందు ఇచ్చి.. జర్నలిజం విద్యార్థినిపై ప్రియుడు, అతడి స్నేహితుడి ఘాతుకం

Dixson Sandra Accused of Raping Journalism Student in Bengaluru
షార్ట్స్‌లో చూడండి
బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో దగ్గరైన ప్రియుడే తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 19 ఏళ్ల ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మత్తు మందు ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64, 70(1), 351(2) కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం, తమిళనాడుకు చెందిన బాధితురాలు బెంగళూరులోని ఓ ప్రముఖ కళాశాలలో జర్నలిజం, సైకాలజీ చదువుతోంది. ఐదు నెలలుగా పీజీ హాస్టల్‌లో ఉంటోంది. ఈ ఏడాది జనవరిలో డిక్సన్ సాండ్రా అనే యువకుడితో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత సాండ్రా ఆమెకు ప్రపోజ్ చేయగా అంగీకరించింది.

ఫిబ్రవరి 14న రాత్రి తనను జక్కూర్‌లోని ఓ విల్లాకు రావాలని సాండ్రా కోరాడని, దాంతో అక్కడికి వెళ్లానని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ సాండ్రా స్నేహితుడు నిఖిల్ కూడా ఉన్నాడని... కాసేపటి తర్వాత వారిద్దరూ బలవంతంగా తన నోట్లో రోజ్ కలర్ టాబ్లెట్ వేశారని, పది నిమిషాల్లోనే తనకు కళ్లు తిరగడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించాయని వివరించింది.

ఆ తర్వాత సాండ్రా తనను ఓ గదిలోకి తీసుకెళ్లారని, కొంతసేపటి తర్వాత స్పృహ కోల్పోయానని తెలిపింది. మెలకువ వచ్చి చూసేసరికి శరీరంపై దుస్తులు తొలగిపోయి ఉన్నాయని, నిఖిల్ తన పక్కనే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, ఆ తర్వాత సాండ్రా కూడా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, గదిలో బంధించారని వాపోయింది.

మరుసటి రోజు మధ్యాహ్నం తనను విడిచిపెట్టారని వెల్లడించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిఖిల్ బెదిరించాడని బాధితురాలు చెప్పింది. మొదట భయపడినా, ఫిబ్రవరి 17న ధైర్యం తెచ్చుకుని, తన సోదరుడికి విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Dixson Sandra
Bengaluru
Journalism student
Rape case
Amruthahalli police station
Nikhil
Sexual assault
Karnataka crime
PG hostel
Jakkur villa

More Telugu News