ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

  • మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు
  • మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థుల హాజరు
  • పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు.. 144 సెక్షన్ అమలు
  • ఈ ఏడాది నుంచి కొన్ని సబ్జెక్టులకు 32 పేజీల జవాబు పత్రం
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్ష మొదలైంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇంటర్ బోర్డు ముందుగానే స్పష్టం చేయడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి.

ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 5,31,275 మంది, మంగళవారం నుంచి ప్రారంభమయ్యే రెండో సంవత్సరం పరీక్షలకు 5,26,264 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 10,57,899 మంది విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డు జవాబు పత్రాల్లో కొన్ని మార్పులు చేసింది. ఫస్టియర్ విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ వంటి కొన్ని ప్రధాన సబ్జెక్టులకు 32 పేజీల బుక్‌లెట్‌ను అందిస్తున్నారు. మిగిలిన సబ్జెక్టులకు, సెకండియర్ విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను ఇచ్చారు. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. ఈ పరీక్షలు మార్చి 24వ తేదీ వరకు జరగనున్నాయి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.


More Telugu News