ఆ వాహనదారులకు టోల్ ఫీజు రిఫండ్!

ముంబయి-పుణె ఎక్స్‌ ప్రెస్‌వేపై ఇటీవల భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వాహనదారులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆ సమయంలో టోల్ చెల్లించిన సుమారు 1.2 లక్షల వాహనాలకు రూ.5.16 కోట్లను తిరిగి చెల్లించనున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ (ఎంఎస్‌ఆర్‌డీసీ) ప్రకటించింది. రానున్న వారంలోగా ఈ మొత్తాన్ని నేరుగా వాహనదారుల ఫాస్టాగ్ ఖాతాల్లో జమ చేయనున్నారు. 

ఈ నెల 3న ఖోపోలి సమీపంలో ప్రొపిలీన్ గ్యాస్‌తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా భద్రతా చర్యల్లో భాగంగా పుణె నుంచి ముంబయి వెళ్లే మార్గాన్ని మూసివేయడంతో, 32 గంటలకు పైగా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వేలాది వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. 

ప్రమాదం జరిగిన వెంటనే టోల్ వసూళ్లను నిలిపివేయాలని అధికారులు ఆదేశించినప్పటికీ, అనేక వాహనాలకు ఫాస్టాగ్ ద్వారా ఆటోమేటిక్‌గా టోల్ రుసుము కట్ అయింది. ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో ఎంఎస్ఆర్డీసీ స్పందించింది. టోల్ ఆపరేటర్ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఫాస్టాగ్ లావాదేవీల డేటాను సమీక్షించి, నష్టపోయిన వాహనదారులను గుర్తించారు. ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు, ఆ సమయంలో పుణె-బెంగళూరు హైవేపై వసూలు చేసిన టోల్‌ను కూడా తిరిగి చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. 

Mumbai-Pune Expressway
Mumbai Pune Expressway
Maharashtra
MSRDC
IRB Infrastructure
Toll Refund
Traffic Jam
Khopoli
Fastag

More Telugu News