జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించిన స్పోర్ట్స్ కారు

  • జూబ్లీహిల్స్‌లో అదుపుతప్పిన ఫెరారీ స్పోర్ట్స్ కారు
  • అతివేగంతో ఇతర వాహనాలను ఢీకొట్టి బీభత్సం
  • ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
  • రోడ్ నెం. 45లో భారీగా నిలిచిన ట్రాఫిక్
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలన్న పోలీసుల సూచన
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆదివారం ఓ ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఈ కారు రోడ్ నెం. 45లో అదుపుతప్పి పక్క రోడ్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పలు కార్లు, బైక్‌లను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసానికి సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి వాహనాలు నుజ్జునుజ్జవగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం కారణంగా రోడ్డుపై వాహనాలు అడ్డదిడ్డంగా పడిపోవడంతో రోడ్ నెం. 45లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు.

రోడ్ నెం. 45 నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు, అలాగే కేబుల్ బ్రిడ్జి నుంచి రోడ్ నెం. 45 వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. వాహనదారులు ఈ మార్గాలను తప్పించి ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News