Donald Trump: కోర్టు తీర్పుపై ట్రంప్ 'యుద్ధం'.. విదేశీ శక్తుల ప్రభావం ఉందంటూ సంచలన ఆరోపణలు!

Donald Trump Reacts to Court Ruling Alleges Foreign Influence
  • సుప్రీంకోర్టు తీర్పు తీవ్ర నిరాశ కలిగించిందన్న ట్రంప్
  • న్యాయమూర్తులపై విదేశీ శక్తుల ఒత్తిడి ఉందేమోనని అనుమానం
  • కొత్తగా 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధింపు
  • అవసరమైతే వాణిజ్య దిగ్బంధం విధిస్తానని హెచ్చరిక
తన పన్నుల విధింపు అధికారాన్ని కట్టడి చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన న్యాయవ్యవస్థపై ధ్వజమెత్తారు. ఈ తీర్పు దేశానికి తీరని అవమానమని, కొందరు న్యాయమూర్తులకు దేశం కోసం సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం లేదని విమర్శించారు. అంతటితో ఆగకుండా, ఈ తీర్పు వెనుక ‘విదేశీ ప్రయోజనాలు’ ఉన్నాయని, న్యాయమూర్తులు బయటి వ్యక్తుల ప్రభావానికి లోనయ్యారని సంచలన ఆరోపణలు చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు తనను ఆపలేదని ట్రంప్ స్పష్టం చేశారు. పాత చట్టం (IEEPA) కింద వేసిన పన్నులను కోర్టు కొట్టివేస్తే, తక్షణమే 'సెక్షన్ 122' కింద 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. "నేను ఎంత పన్ను వేయాలనుకుంటే అంత వేస్తాను. పాత చట్టాల కంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నవి చాలా శక్తిమంతమైనవి. అవసరమైతే ఏ దేశంపైనైనా వాణిజ్య దిగ్బంధం విధిస్తాను, ఇతర దేశాల వాణిజ్యాన్ని దెబ్బతీసే అధికారం నాకుంది" అంటూ ఆయన తన దూకుడును ప్రదర్శించారు.

సుంకాల విధింపు వల్ల అమెరికాలో పరిశ్రమలు కళకళలాడుతున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. జార్జియాలోని ఒక స్టీల్ ప్లాంట్ యజమాని తనను కలిసి "సార్, మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలని ఉంది" అని అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. విదేశీ వస్తువుల దిగుమతి ఆగిపోవడంతో అమెరికాలో నిరుద్యోగం తగ్గిందని, స్టాక్ మార్కెట్ (Dow Jones) 50 వేల మార్కును దాటిందని ఆయన గర్వంగా ప్రకటించారు.

సుప్రీంకోర్టు తీర్పుతో గతంలో వసూలు చేసిన సుమారు 175 బిలియన్ డాలర్ల పన్ను ఆదాయం ఇప్పుడు అనిశ్చితిలో పడింది. ఆ డబ్బును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందా? అన్న ప్రశ్నకు.. "కోర్టు ఆ విషయం గురించి చర్చించలేదు, దీనిపై మరో ఐదేళ్ల పాటు కోర్టులో పోరాటం సాగుతుంది" అని ట్రంప్ దాటవేశారు. 
Donald Trump
Trump tariffs
US Supreme Court
Foreign influence
Section 122
Global tariffs
Trade embargo
US economy
Taxation
IEEPA

More Telugu News