Ramchander Rao: ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతోందని 'సామ్నా' కథనం చెబుతోంది: రాంచందర్ రావు

మహారాష్ట్రలోని శివసేన (యూబీటీ)కి చెందిన పత్రిక 'సామ్నా'లో వచ్చిన కథనంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో నాయకత్వ మార్పు అవసరమని ‘సామ్నా’ పత్రికలో కథనం వచ్చిందని... ఆ కూటమి విచ్ఛిన్నమవుతుందనే విషయాన్ని సదరు కథనం స్పష్టంగా చెబుతోందని రాంచందర్ రావు అన్నారు. ఇవాళ ఉదయం జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఇండియా కూటమిలోని టీఎంసీ, డీఎంకే వంటి చిన్న పార్టీలు సైతం కూటమి నాయకత్వ మార్పును కోరుతున్నాయని... ప్రస్తుత నాయకత్వంపై భాగస్వామ్య పక్షాలకు నమ్మకం పోయిందనే విషయం దీంతో క్లియర్‌గా అర్థం అవుతోందని అన్నారు. కూటమిలో భాగంగా ఉన్న పార్టీ యూబీటీకి చెందిన ‘సామ్నా’ పత్రికే సొంత కూటమి గురించి ఇలాంటి కథనాన్ని ప్రచురించడం కూటమిలోని అంతర్గత విభేదాలను బయటపెట్టిందని ఎద్దేవా చేశారు. 


ప్రధాని మోదీ నేతృత్వంలో ‘వికసిత్ భారత్’ నినాదంతో దేశం అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని అన్నారు. దేశ ప్రజలు ఇండియా కూటమిని తిరస్కరిస్తున్నారని చెప్పారు. త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Ramchander Rao
India Alliance
Samna
Shiv Sena UBT
Telangana BJP
Indian National Developmental Inclusive Alliance
Vikshit Bharat
West Bengal Elections
Tamil Nadu Elections
NDA

More Telugu News