30బీ, 105బీ... మన భారత ఏఐ మోడళ్లు కూడా వచ్చేశాయి!

  • రెండు కొత్త లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను ఆవిష్కరించిన సర్వమ్ ఏఐ
  • భారత్ సొంత ఏఐ సామర్థ్యాలను పెంచడమే లక్ష్యం
  • గూగుల్ జెమిని కన్నా తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు
  • ఇండియా ఏఐ మిషన్ కింద భారీగా లబ్ధి పొందిన సర్వమ్ ఏఐ
బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ సర్వమ్ ఏఐ, దేశీయ ఏఐ రంగంలో కీలక ముందడుగు వేసింది. బుధవారం జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో రెండు కొత్త లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను (LLMs) ఆవిష్కరించింది. స్వదేశీ ఏఐ సామర్థ్యాలను నిర్మించుకోవాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ మోడళ్లను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది.

'మిక్స్చర్-ఆఫ్-ఎక్స్‌పర్ట్స్' (MoE) అనే అధునాతన ఆర్కిటెక్చర్‌తో ఈ మోడళ్లను రూపొందించారు. వీటిలో మొదటిది 'సర్వమ్ 30B' మోడల్. ఇది 30 బిలియన్ పారామీటర్లతో పనిచేస్తుంది. ఈ నిర్మాణం వల్ల పనితీరు మెరుగ్గా ఉండటమే కాకుండా, ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు ప్రత్యూష్ కుమార్ వివరించారు. ఈ మోడల్ 32,000 టోకెన్ల కాంటెక్ట్స్ ను సపోర్ట్ చేస్తుంది.

అదేవిధంగా, 105 బిలియన్ పారామీటర్లతో మరో శక్తివంతమైన మోడల్‌ను కూడా సర్వమ్ ఏఐ పరిచయం చేసింది. ఇది మరింత సంక్లిష్టమైన ఆదేశాలను సైతం అర్థం చేసుకుంటుంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి మోడళ్లతో ఇది పోటీ పడుతుందని ప్రత్యూష్ కుమార్ తెలిపారు. గూగుల్ అభివృద్ధి చేసిన జెమిని ఫ్లాష్ కన్నా తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు ఇస్తుందని, ముఖ్యంగా భారతీయ భాషల విషయంలో దీని పనితీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.

విదేశీ ఏఐ వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం 'ఇండియా ఏఐ మిషన్' ప్రారంభించిన విషయం తెలిసిందే. రూ.10,000 కోట్ల నిధులతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ మిషన్ కింద జీపీయూ సబ్సిడీలను పొందిన అతిపెద్ద లబ్ధిదారుగా సర్వమ్ ఏఐ నిలిచింది. దాదాపు రూ.99 కోట్ల సబ్సిడీతో 4,096 ఎన్విడియా హెచ్100 జీపీయూలను దక్కించుకుంది. ఇండియా కోసం ఫౌండేషనల్ ఏఐ మోడల్‌ను నిర్మించేందుకు ఎంపికైన తొలి కంపెనీ కూడా ఇదే. వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్ కలిసి 2023 జులైలో సర్వమ్ ఏఐని స్థాపించారు.


More Telugu News