చివరి లీగ్ మ్యాచ్... నెదర్లాండ్స్‌పై టాస్ గెలిచిన భారత్

  • టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ మ్యాచ్
  • అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన టీమిండియా
  • మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం
  • భారత జట్టులో రెండు మార్పులు.. అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి
  • తాము కూడా బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని నెదర్లాండ్స్ కెప్టెన్ వెల్లడి
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ గ్రూప్-ఎ పోరులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, ముందుగా బోర్డుపై పరుగులు పెట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావాలన్నది తమ వ్యూహమని తెలిపాడు. జట్టులో ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణిస్తున్నారని, ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటుండటం శుభపరిణామమని పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రెండు మార్పులు చేసినట్లు సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను, అక్షర్ పటేల్‌కు విశ్రాంతి ఇచ్చి ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.

మరోవైపు నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ, తాము టాస్ గెలిచి ఉంటే బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. ఈ టోర్నమెంట్‌లో తమ ప్రస్థానాన్ని మంచి ప్రదర్శనతో ముగించాలనుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా, భారత్ ఇప్పటికే గ్రూప్-ఏలో వరుసగా మూడు విజయాలతో సూపర్-8లోకి ప్రవేశించడం తెలిసిందే. ఇదే గ్రూప్ నుంచి పాకిస్థాన్ కూడా సూపర్-8కి చేరడంతో, ఈ వరల్డ్ కప్ లో మరోసారి దాయాదుల సమరం జరిగే అవకాశాలు ఉన్నాయి.

జట్లు
భారత్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

నెదర్లాండ్స్: మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్/వికెట్ కీపర్), జాక్ లయన్-కాచెట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, నోవా క్రోస్.


More Telugu News