Deveshacharya Maharaj: ముస్లిం ఉద్యోగులకు రంజాన్ వెసులుబాటు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై హనుమాన్‌గఢీ అర్చకుడి ఆగ్రహం

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది పూర్తిగా ఓటు బ్యాంకు రాజకీయమేనని సిద్ధ పీఠ్ హనుమాన్‌గఢీకి చెందిన ప్రధాన అర్చకుడు దేవేశాచార్య మహారాజ్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమని ఆయన బుధవారం వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, "ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. హిందువులకు కూడా నవరాత్రులు లేదా ఇతర పండుగల సమయంలో ఇలాంటి సౌకర్యం కల్పిస్తారా? కల్పించరని నేను భావిస్తున్నాను. గతంలో తెలంగాణ ప్రభుత్వం హిందువుల పండుగ సెలవులను కూడా రద్దు చేయడానికి ప్రయత్నించింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వెసులుబాటు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు అమల్లో ఉంటుందని మెమోలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం ఉద్యోగులు సకాలంలో ఇళ్లకు చేరుకుని ప్రార్థనలు చేసుకోవడానికి, ఉపవాసం విరమించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లింలకు రంజాన్ అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెల రోజుల పాటు వారు తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
Deveshacharya Maharaj
Telangana government
Ramadan
Muslim employees
Hanumangarhi
Vote bank politics
Hindu festivals
K Ramakrishna Rao
Telangana news
Indian politics

More Telugu News