కల్తీ నెయ్యి అంశంపై చర్చకు సిద్ధం... ఆధారాలు ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి: అనిత

  • రసాయనాలతో నెయ్యి తయారు చేశారని సిట్ రిపోర్ట్ ఇచ్చిందన్న అనిత
  • పింక్ డైమండ్ పేరుతో గతంలో సభా సమయం వృథా చేశారని మండిపాటు
  • సాక్షిలో రాసే విషయాలనే వైసీపీ నేతలు మాట్లాడుతుంటారని ఎద్దేవా

తిరుమల లడ్డూలోని కల్తీ నెయ్యి వ్యవహారంపై సభలో చర్చించాలని వైసీపీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత మాట్లాడుతూ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని అన్నారు. చర్చకు ఆధారాలతో రావాలని వైసీపీకి సవాల్ విసిరారు. ప్రజాహితం కోసం ఎలాంటి చర్చలకైనా తాము సిద్ధమని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు సవాల్ విసిరారు. అది నెయ్యి కాదు, రసాయనాల మిశ్రమమని సిట్ రిపోర్ట్ తేల్చిందని తెలిపారు. చర్చకు సిద్ధమని సభలోనే మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారని గుర్తుచేశారు.


దేవుడంటే వైసీపీ సభ్యులకు భక్తిభావం లేదని... పాల సేకరణ కూడా లేని సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఇచ్చారని అనిత మండిపడ్డారు. ఆ నెయ్యిలో ఎలాంటి రసాయనాలు కలిపారో కూడా సభలో చర్చిద్దామని అన్నారు. గతంలో పింక్ డైమండ్ పేరుతో సభా సమయాన్ని వృథా చేశారని... అధికారుల విచారణలో అసలు పింక్ డైమండే లేదని తేలిందని చెప్పారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకోవద్దని హెచ్చరించారు. 

సాక్షి పేపర్ రాసే విషయాలనే వైసీపీ నేతలు మాట్లాడుతుంటారని అనిత దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో యాడ్స్ రూపంలో సాక్షికి రూ. 600 కోట్ల ప్రజాధనాన్ని చెల్లించారని విమర్శించారు. 

మదనపల్లి చిన్నారి హత్య కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని... తప్పు చేశాడు కాబట్టే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.


More Telugu News