Salim Khan: సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్‌కు మెదడులో రక్తస్రావం

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీం ఖాన్ అస్వస్థతకు గురవడం తెలిసిందే. ఆయన స్వల్పంగా బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం)తో బాధపడుతున్నారని చికిత్స అందిస్తున్న వైద్యుడు జలీల్ పార్కర్ వెల్లడించారు. ప్రస్తుతం సలీమ్ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

సలీం ఖాన్‌కు అయినది స్వల్ప బ్రెయిన్ హెమరేజ్ అని, దీనికి సర్జరీ అవసరం లేదని డాక్టర్ జలీల్ పార్కర్ స్పష్టం చేశారు. ఆయనకు అధిక రక్తపోటు కూడా ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఆయనకు డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు.

కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, అయితే వృద్ధాప్యం కారణంగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు వివరించారు. మంగళవారం ఉదయం శరీరంలో వాపులు ఉన్నాయని చెప్పడంతో కుటుంబ వైద్యుడి సూచన మేరకు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.

విషయం తెలిసిన వెంటనే సల్మాన్ ఖాన్, కుమార్తెలు అల్విరా, అర్పితా ఖాన్ ఆసుపత్రికి చేరుకున్నారు. మడ్ ఐలాండ్‌లో జరుగుతున్న షూటింగ్‌ను అర్ధాంతరంగా ఆపేసి సల్మాన్ తన తండ్రిని చూసేందుకు వచ్చారు. న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరో సర్జన్‌లతో కూడిన ప్రత్యేక వైద్య బృందం సలీం ఖాన్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
Salim Khan
Salman Khan
Brain Hemorrhage
Leelavati Hospital
Mumbai
Writer
Bollywood
Health Update
Alvira Khan
Arpita Khan

More Telugu News