బొత్స సత్యనారాయణ పట్టు కోల్పోయారు: నారా లోకేశ్
- తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై మండలిలో చర్చకు పట్టుబట్టిన వైసీపీ
- వైసీపీ తీర్మానాలను డిస్మిస్ చేసిన మోషేన్ రాజు
- అసెంబ్లీలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారన్న బొత్స
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చకు వైసీపీ మళ్లీ పట్టుబడుతోంది. నిన్న ఈ విషయమై వైసీపీ తీర్మానం ఇవ్వగా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. నేడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చకు తీర్మానాన్ని ఇవ్వగా మోషేన్ రాజు డిస్మిస్ చేశారు.
దీంతో మండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “టీటీడీలో ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో ఈ వ్యవహారంపై చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. అందుకే మండలిలో చర్చకు మేము డిమాండ్ చేస్తున్నాం” అన్నారు.
బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీ లాబీలో నిర్వహించిన చిట్ చాట్‌లో స్పందించారు. “శాసనమండలిలో ఉన్న వైసీపీ సభ్యులపై బొత్స సత్యనారాయణ పట్టు కోల్పోయారు. వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఒకరు లడ్డూ కల్తీపై చర్చించాలని, మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చించాలని అడిగారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి” అని వ్యాఖ్యానించారు.