Revanth Reddy: అధికారుల తీరుపై రేవంత్ అసంతృప్తి.. సస్పెండ్ చేస్తానని వార్నింగ్

Revanth Reddy Expresses Displeasure Over Officials Performance Warns Suspension
  • పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపై రేవంత్ సమీక్ష
  • కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం నుంచి ఫీల్డ్‌లో ఉండాలని ఆదేశం
  • అడ్వర్టైజింగ్ బోర్డుల నియంత్రణపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

తెలంగాణలో పురపాలక శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో ఈరోజు నిర్వహించిన పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... “కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం నుంచి ఫీల్డ్‌లో ఉండాలి. పారిశుద్ధ్యం, రోడ్ల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడిక్కడే అధికారులను సస్పెండ్ చేస్తాను” అని హెచ్చరించారు.


నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ఒక రోజు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ బాగా ఉన్న చోట్ల పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జిలు నిర్మించాలని చెప్పారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అడ్వర్టైజింగ్ బోర్డుల నియంత్రణపై జాగ్రత్తలు తీసుకోవాలని... ప్రభుత్వ కార్యక్రమాలకు 10 శాతం బోర్డులు కేటాయించాలని అన్నారు. అనధికార బోర్డులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడ్వర్టైజింగ్ బోర్డుల నుంచి సంవత్సరానికి ఒకసారి ఫీజు వసూలు చేయాలని సూచించారు. అన్ని పార్కుల వివరాలు సేకరించాలన్నారు.



Revanth Reddy
Telangana
Municipal Administration
Urban Development
Smart Poles
Skywalk Bridges
Multi-level Car Parking
Advertising Boards
Cleanliness
Suspension Warning

More Telugu News