AI Summit 2024: హై-సెక్యూరిటీ జోన్‌లో హస్తలాఘవం.. ఏఐ సమ్మిట్ లో చోరీ

AI Summit Theft Niosapien CEO Dhananjay Yadav Expresses Disappointment
  • ప్రధాని సందర్శన వేళ విలువైన వస్తువులు మాయం
  • సోషల్ మీడియా వేదికగా స్టార్టప్ సీఈఓ ఆవేదన
  • కట్టుదిట్టమైన భద్రత మధ్య చోరీ ఎలా జరిగిందని ప్రశ్న
దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో అనూహ్య ఘటన వెలుగుచూసింది. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు హాజరైన ఈ వేదికపై, ఒక స్టార్టప్ కంపెనీకి చెందిన అత్యాధునిక ఏఐ పరికరాలు చోరీకి గురయ్యాయి. ఈ సంఘటన భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది.

అసలేం జరిగిందంటే..
బెంగళూరుకు చెందిన ‘నియోసాపియన్’ అనే ఏఐ స్టార్టప్ ప్రతినిధులు ఈ సదస్సులో తమ ఆవిష్కరణలను ప్రదర్శించడానికి వచ్చారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగ్జిబిషన్ ఏరియాను సందర్శించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకే స్టాల్స్ ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని భద్రతా సిబ్బంది ఆదేశించారు.

భరోసా ఇచ్చారు కానీ..
తన కంపెనీ రూపొందించిన 'ఏఐ వేరబుల్' పరికరాలను వెంట తీసుకెళతానని కంపెనీ సీఈఓ ధనంజయ్ యాదవ్ కోరగా, అక్కడ భద్రతకు ఏ డోకా ఉండదని సిబ్బంది భరోసా ఇచ్చారు. అందరూ ల్యాప్‌టాప్‌లు కూడా అక్కడే వదిలి వెళుతున్నారని చెప్పారు. ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ధనంజయ్ తన స్టాల్‌కు వచ్చి చూడగా, పరికరాలు ఉన్న పెట్టెలు ఖాళీగా కనిపించాయి. అత్యంత విలువైన ఏఐ పరికరాలు మాయమవడంతో ఆయన విస్మయానికి గురయ్యారు.

సీఈఓ ఆవేదన..
ఈ చేదు అనుభవాన్ని ధనంజయ్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ‘‘హై-సెక్యూరిటీ జోన్ కావడంతో ఆ సమయంలో కేవలం భద్రతా సిబ్బందికి, అధికారిక బృందాలకు మాత్రమే అక్కడికి వెళ్లే అనుమతి ఉంది. మరి అంతటి కట్టుదిట్టమైన భద్రత మధ్య దొంగతనం ఎలా జరిగింది?’’ అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఏఐ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహాన్ని చూసి ఎంతో ఉత్సాహంతో, భారీ ఖర్చుతో బెంగళూరు నుంచి వస్తే.. ఈ అనుభవం తన ఉత్సాహంపై నీళ్లు చల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భద్రతపై ప్రశ్నలు
భారత్ మండపం వంటి అంతర్జాతీయ వేదికపై, అదీ ఎస్పీజీ వంటి ఉన్నత స్థాయి బలగాల పర్యవేక్షణలో ఉండగా దొంగతనం జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై విచారణ జరిపించాలని టెక్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
AI Summit 2024
India AI Impact Summit
Narendra Modi
Dhananjay Yadav
AI Wearable Device Theft
Niosapien
Bharat Mandapam Security Breach
Artificial Intelligence
Technology Crime
New Delhi

More Telugu News