భక్తులకు అలర్ట్: మార్చి 3న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత... కారణం ఇదే!

  • చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత
  • ఉదయం 9 గంటల నుంచి సుమారు 10 గంటల పాటు తలుపుల మూసివేత
  • వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు పలు ఆర్జిత సేవలు రద్దు
  • గ్రహణం అనంతరం శుద్ధి చేసి రాత్రి 8:30 నుంచి దర్శనాలు
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ మేరకు ఆలయ అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు.

ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం, గ్రహణానికి ఆరు గంటల ముందుగా ఆలయ ద్వారాలను మూసివేయడం సంప్రదాయం. మార్చి 3న మధ్యాహ్నం 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు చంద్రగ్రహణం ఉండటంతో, అదే రోజు ఉదయం 9 గంటలకే ఆలయ తలుపులు మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత, సాయంత్రం 7:30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. దీంతో సుమారు 10.30 గంటల పాటు శ్రీవారి దర్శనాలు నిలిచిపోనున్నాయి.

ఆలయ తలుపులు తెరిచిన తర్వాత శుద్ధి, పుణ్యాహవచనం వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించి, రాత్రి 8:30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. గ్రహణం కారణంగా ఆ రోజు నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. ఇదే రోజు కుమారధార తీర్థం ముక్కోటి ఉత్సవాలు కూడా జరగనున్నాయని, వాటికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మార్పులను గమనించి, భక్తులు తమ తిరుమల యాత్రను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.


More Telugu News