తిరుమల శ్రీవారి మే నెల దర్శన కోటా.. తేదీల వారీగా పూర్తి షెడ్యూల్ ఇదే!

  • మే నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల షెడ్యూల్
  • ఫిబ్రవరి 18న ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ ప్రారంభం
  • ఫిబ్రవరి 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల
  • తిరుమల, తిరుపతి గదుల కోటాను కూడా విడుదల చేయనున్న టీటీడీ
  • వివిధ తేదీల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్న టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. 2026 మే నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు తేదీల వారీగా షెడ్యూల్‌ను ప్రకటించింది. భక్తులు ఈ తేదీలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

తేదీల వారీగా కోటా విడుదల వివరాలు:

ఫిబ్రవరి 18: సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ ప్రక్రియ ఫిబ్రవరి 18న ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. భక్తులు ఫిబ్రవరి 20 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించి, టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 21: కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను అందుబాటులోకి తేనున్నారు.

ఫిబ్రవరి 23: ఈ రోజున మూడు వేర్వేరు కోటాలను విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఫిబ్రవరి 24: భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల బుకింగ్ కోటాను అందుబాటులో ఉంచుతారు.

ఫిబ్రవరి 27: ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

భక్తులు తమకు కావాల్సిన సేవలు, దర్శన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.


More Telugu News