బంగ్లా కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీకి ఆహ్వానం!

  • బంగ్లాదేశ్‌లో కొలువుదీరనున్న బీఎన్‌పీ నూతన ప్రభుత్వం
  • ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీకి ఆహ్వానం పంపనున్న బీఎన్‌పీ
  • పాక్ ప్రధానితో పాటు ఇతర సార్క్ దేశాల నేతలకూ పిలుపు
  • భారత్‌తో నిర్మాణాత్మక సంబంధాలకు సిద్ధమని ప్రకటన
  • ఈనెల 17న కొత్త ఎంపీలు, కేబినెట్ ప్రమాణస్వీకారం
బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. తారిఖ్ రెహమాన్ నేతృత్వంలో కొలువుదీరనున్న ఈ ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని బీఎన్‌పీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఆదివారం సంకేతాలు ఇచ్చాయి.

భారత్‌తో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఎన్‌పీ స్పష్టం చేసింది. "పరస్పర గౌరవం, ఒకరి ఆందోళనలను మరొకరు అర్థం చేసుకుంటూ, ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటాం" అని బీఎన్‌పీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోదీతో పాటు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇతర సార్క్ దేశాధినేతలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు సీనియర్ నేతలు తెలిపారు. 2014లో ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం తర్వాత మళ్లీ ఈ స్థాయిలో సార్క్ నేతలు ఒకచోట చేరడం ఇదే అవుతుంది.

ఈనెల 17న కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనుండగా, అదే రోజున కొత్త కేబినెట్ కూడా కొలువుదీరే అవకాశం ఉంది. దేశ ప్రయోజనాలకే తమ తొలి ప్రాధాన్యమని, దానిని దృష్టిలో ఉంచుకొనే విదేశాంగ విధానం ఉంటుందని బీఎన్‌పీ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ ఇప్పటికే స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ చొరవతో ప్రారంభమైన సార్క్‌ను పునరుద్ధరించాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, క్షీణించిన శాంతిభద్రతల మధ్య తాము ప్రయాణం మొదలుపెట్టబోతున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరి 12న జరిగిన జాతీయ ఎన్నికల్లో బీఎన్‌పీ కూటమి 212 స్థానాల్లో గెలుపొంది భారీ మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం తర్వాత బీఎన్‌పీ అధికారంలోకి వస్తుండటంతో ఈ పరిణామాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.


More Telugu News