Janasena Party: తెలంగాణలో రెండు చోట్ల గెలవడంపై స్పందించిన జనసేన పార్టీ

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో రెండు చోట్ల గెలవడం సంతోషకరమని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని జనసేన పార్టీ తెలంగాణ విభాగం ప్రకటించింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో జనసేన ఉనికిని చాటుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ రెండు చోట్ల విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షడు బొంగునూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలలో 330 పైగా అభ్యర్థులు పోటీలో నిలిచారని తెలిపారు. మంచిర్యాల్ కార్పొరేషన్‌లో 34వ డివిజన్ నుండి జనసేన కార్పొరేటర్ అభ్యర్థి అగ్గు సాగర్ 31 ఓట్ల మెజార్టీతో, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డు నుండి 29 ఓట్ల మెజారిటీతో ఆరూరి విజయలక్ష్మి నాగేశ్వరరావు విజయం సాధించారని తెలిపారు.

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీకి ఓటేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల కోసం పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, వీర మహిళలు అందరూ ఎంతో కష్టపడి పనిచేశారని అన్నారు. తక్కువ సమయంలోనే పార్టీ గెలుపు కోసం ఎంతో శ్రమించిన వారందరికీ ఆయన పవన్ కల్యాణ్ తరఫున, రాష్ట్ర నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ పార్టీ ఇన్‌ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ, రెండు చోట్ల గెలవడం సంతోషకరమని అన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో పవన్ కల్యాణ్ పార్టీని స్థాపించారని పార్టీ రాష్ట్ర నాయకులు రాజలింగం అన్నారు. పవన్ కల్యాణ్ ఆశయాలను,  పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.

పార్టీని మరింత బలోపేతం చేస్తామని సీనియర్ నాయకుడు ఆర్కే సాగర్ అన్నారు. తెలంగాణలో జనసేన బోణీ కొట్టిందని మరో నాయకుడు ప్రేమ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని అన్నారు.
Janasena Party
Telangana municipal elections
GHMC elections
Pawan Kalyan
Bongunuri Mahender Reddy

More Telugu News