KTR: బెల్లంపల్లిలో ఆసక్తికరం... కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్లు.. మద్దతిస్తానన్న బీజేపీ కౌన్సిలర్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 30కి పైగా మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆయా చోట్ల చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇక్కడ మొత్తం 34 వార్డులు ఉండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 14 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీజేపీ ఒకటి, ఇతరులు 5 స్థానాలు దక్కించుకున్నారు.

ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ స్వతంత్రులతో చర్చలు జరుపుతున్న క్రమంలో ముగ్గురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి చెందిన 26వ వార్డు కౌన్సిలర్ ఇప్పకుమార్ స్వామి, కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసి గెలిచిన 30వ వార్డు కౌన్సిలర్ సుఖేషిణి భరద్వాజ్, 34వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కొక్కుల రామ్మూర్తి బీఆర్ఎస్‌లో చేరారు.

30 వార్డు కౌన్సిలర్, 26వ వార్డు కౌన్సిలర్‌లు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 34వ వార్డు బీజేపీ అభ్యర్థి మాత్రం అధికారికంగా చేరనప్పటికీ, బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితుడనై మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ ముగ్గురితో బీఆర్ఎస్ పార్టీ బలం 17కు చేరుకుంది.
KTR
KTR BRS
Bellampalli Municipality
Telangana Municipal Elections
BRS Party
Congress Party

More Telugu News