ఆకులు తింటూ పదేళ్లుగా అడవిలో జీవనం.. ఆధునిక టార్జాన్ కథ!

  • పెళ్లి వద్దని అడవి బాట పట్టిన వైనం
  • కర్ణాటకలో 'ఆధునిక టార్జాన్'గా గుర్తింపు
  • సిక్స్ ప్యాక్‌తో ఫిట్‌గా ఉండటంపై వైద్యుల ఆశ్చర్యం
సమాజానికి, ఆధునిక జీవితానికి దూరంగా పదేళ్లుగా అడవిలో నివసిస్తున్న ఓ యువకుడి విచిత్ర కథ ఇది. కర్ణాటకలోని బెళగావి జిల్లా సౌందత్తి తాలూకాకు చెందిన 34 ఏళ్ల బుడాన్ ఖాన్ హోసమణి పచ్చి ఆకులు, మొక్కలు మాత్రమే తింటూ జీవిస్తున్నాడు. వండిన ఆహారం ముట్టకుండా, కుటుంబానికి దూరంగా గడుపుతున్న అతడిని స్థానికులు 'ఆధునిక టార్జాన్' అని పిలుస్తున్నారు.

సుమారు పదేళ్ల క్రితం పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో బుడాన్ ఖాన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన గ్రామ సమీపంలోని హెగ్గొల్లా కొండ ప్రాంతాన్ని ఆవాసంగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి అడవిలోని కోతులను గమనిస్తూ, అవి తింటున్న సుమారు 80 రకాల ఆకులను తినడం అలవాటు చేసుకున్నాడు. ఈ పచ్చి ఆకులను జీర్ణం చేసుకోవడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ యోగా కూడా చేస్తాడు.

కేవలం ఆకులు తింటూ జీవిస్తున్నా, బుడాన్ ఖాన్ 5.9 అడుగుల ఎత్తు, 60 కిలోల బరువుతో, సిక్స్ ప్యాక్ శరీరంతో ఎంతో ఫిట్‌గా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. "తిరిగి ఇంటికి రమ్మని ఎన్నోసార్లు నచ్చజెప్పాం. కానీ అతడు ఒప్పుకోలేదు. అడవిలోనే సంతోషంగా ఉన్నానని చెబుతున్నాడు" అని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.

బుడాన్ ఖాన్ జీవనశైలి వైద్య ప్రపంచానికి సైతం అంతుబట్టడం లేదు. జంతువులు మాత్రమే జీర్ణం చేసుకోగల పచ్చి ఆకులను మనిషి తినగలగడం అరుదైన విషయమని, అతని జీర్ణ వ్యవస్థపై శాస్త్రీయంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News