Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికలు.. ఎక్స్‌అఫీషియో ఓటుపై ఈసీ స్పష్టత.. ఎవరు ఎక్కడ వేయాలంటే..!

Telangana Municipal Elections EC Clarifies Ex Officio Vote Rules
  • 30కి పైగా మున్సిపాలిటీల్లో హంగ్
  • ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు నియోజకవర్గంలోని ఒక మున్సిపాలిటీలో ఓటు వేయాలన్న ఈసీ
  • రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఓటు హక్కు ఉన్న ప్రాంతంలో ఓటు వేయాలన్న ఈసీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 30కి పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. దీంతో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. పలు మున్సిపాలిటీలలో ఎక్స్‌అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఈ క్రమంలో ఎక్స్‌అఫీషియో ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది.

ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియో ఓటు వేయవచ్చునని వెల్లడించింది. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే ఎక్స్‌అఫీషియో ఓటును వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫీషియో ఓటు నమోదుకు నేటి వరకు ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది.

తెలంగాణలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. నిన్న ఫలితాలు వెలువడగా మూడు కార్పొరేషన్లు, 66 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ, 13 మున్సిపాలిటీలను బీఆర్ఎస్, కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ దక్కించుకున్నాయి. స్వతంత్రులు లేదా ఇతరులతో కలిపి నిజామాబాద్ కార్పొరేషన్‌ను కూడా బీజేపీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. 37 మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చింది.

ఏడు కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, 116 మున్సిపాలిటీలకు ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు ఈ నెల 16న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికల్లో పాల్గొనాలని కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులు, పార్టీల అధ్యక్షులకు సమాచారం ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. హంగ్ ఉన్నచోట ఎక్స్‌అఫీషియో ఓటు కీలకం కానున్న నేపథ్యంలో ఈసీ స్పష్టతనిచ్చింది.
Telangana Municipal Elections
Municipal Elections
Telangana Elections
Ex-Officio Vote
Congress Party

More Telugu News